పాకిస్తాన్‌లో ఐపీఎల్.. నోరు జారిన అక్మల్

బలమైన ప్రత్యర్థితో పోరాటం ఆటగాళ్లకు మజాని.. అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక క్రికెట్ అంటే చెప్పేదేముంది. వన్డే మ్యాచ్‌లంటేనే బోలెడంత ఆసక్తి చూపించే క్రికెట్ అభిమానులు ఇక ఐపిఎల్ మ్యాచ్ అంటే పనులన్నీ పక్కన పడేసి మరీ టీవీలకు అతుక్కుపోతారు.

అవును.. ఇంతకీ ఐపీఎల్ ఏంటి? పాకిస్తాన్‌లో జరగడం ఏంటి.. అదే కదా ట్విస్ట్.. పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (PSL)కు బదులు ‘IPL’ అని వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ పాకిస్తాన్‌లో జరుగుతుందంటూ నోరు జారాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.

ఇంతకీ ఉమర్ ఏ సందర్భంలో ఇలా మాట్లాడాడంటే.. PSL లీగ్ మ్యాచ్‌లు యూఏఈలో జరిగాయి. దాదాపు 26 మ్యాచ్‌లను అక్కడ నిర్వహించారు. మిగిలిన 4 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్స్ పాకిస్తాన్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో పాల్గొనే క్రికెటర్లంతా కరాచీ చేరుకున్నాయి. జరుగుతున్న మ్యాచ్‌‌లను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఉమర్ మాట్లాడుతూ పొరపాటున PSLకి బదులు IPL అని అనడంతో నెటిజన్స్‌కి దొరికిపోయాడు.

పాకిస్తాన్ క్రికెటర్ల మనసు ఎప్పుడూ IPLపైనే ఉంటుందని హేళన చేస్తున్నారు. IPL అంటే వారికి ఎంత ప్రేమో.. అందుకే IPLని పలవరిస్తున్నారు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. PSL ఫైనల్ మ్యాచ్ కంటే IPL ఓపెనింగ్ మ్యాచ్ అంటేనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది అని ట్రోల్ చేస్తున్నారు. కాగా, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా పాక్ క్రికెటర్లను ఐపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ నిషేధించింది.