బాలాకోట్ దాడి ఎఫెక్ట్ : ఖాళీగా దర్శనమిస్తున్న పాకిస్థాన్‌ నావికాదళ స్థావరాలు

balakot surgical strike effect in pakisthan navy

బాలాకోట్‌పై భారత్‌ దాడి తర్వాత పాకిస్థాన్‌లోని నావికాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ దాడి అనంతరం అప్రమత్తమైన పాక్‌ నావికాదళం నౌకాశ్రయాలను వీడి సముద్రంలోకి వెళ్లినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. 1971లో భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో మన నావికాదళం ఆపరేషన్‌ ట్రైడెంట్‌ పేరుతో కరాచీ రేవును ధ్వంసం చేసింది. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి పాక్‌కు చాలా ఏళ్లు పట్టింది.

పాక్‌ నావికాదళంలోని నౌకలు ప్రధానంగా కరాచీ, ఒర్మార, గ్వాదర్‌ నౌకాశ్రయాల్లో ఉంటాయి. ఫిబ్రవరి 28 వరకు ప్రధాన నౌకలు అక్కడే కనిపించాయి. తొమ్మిది ఫ్రిగేట్లు, ఎనిమిది సబ్‌మెరైన్లు, మరో 17 గస్తీ, ఇతర నౌకలు అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కసారి నౌకాశ్రయాలు మొత్తం ఖాళీ అయ్యాయి. భారత వైమానిక దాడుల తర్వాత రెండు రోజుల్లోనే ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కేవలం సముద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఒక్క నౌకమాత్రమే మిగిలింది.

చైనా నిర్మిస్తున్న గ్వాదర్‌ పోర్టు వీడి పాక్‌ నావికాదళం మార్చి 6వ తేదీ నాటికి సముద్రంలోకి వెళ్లిపోయింది. అదే విధంగా ఒర్మార పోర్టు నుంచి కూడా ప్రధాన యుద్ధనౌకలు సముద్రంలోకి వెళ్లాయి. భారత్‌ దాడితో అప్రమత్తమైన పాక్‌ తన నావికాదళాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. 1971 ఎక్కడ రిపీటవుతుందోనని పాక్‌ వణికిపోతోంది.