ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు షాక్‌

ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు షాక్… సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సిరీస్ డిసైడర్‌లో బౌలర్లు పర్వాలేదనిపించినా… బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఓటమికి కారణమైంది. మరోవైపు వరుసగా రెండు వన్డేలు కోల్పోయినా… తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆసీస్ పదేళ్ళ తర్వాత భారత్‌లో సిరీస్ గెలుచుకుంది.

ఆసీస్ గడ్డపై టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత సొంతగడ్డపై సిరీస్‌కు ముందు అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తగ్గట్టే వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇక సిరీస్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ప్రపంచకప్‌కు ముందు ప్రయోగాలు చేసేందుకు కూడా ఇదే మంచి ఛాన్స్‌ అంటూ మేనేజ్‌మెంట్ భావించింది. అయితే ప్రయోగాల మాట ఎలా ఉన్నా… టీమిండియాకు మాత్రం ఆస్ట్రేలియా షాకిచ్చింది. అనూహ్యంగా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ ఎగరేసుకుపోయింది.

రాంఛీ వన్డే నుండి ఆసీస్ అద్భుతంగా పుంజుకుంటే… అప్పటి వరకూ వరుస విజయాలు సాధించిన భారత్ మాత్రం వెనుకబడిపోయింది. ధోనీకి విశ్రాంతినివ్వడం కొంత ప్రభావం చూపిందన్న వాదన వినిపించింది. కోహ్లీ కెప్టెన్సీపైనా పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో సిరీస్ డిసైడర్ ఢిల్లీ వన్డేలో భారత్ గెలిచి వాటికి సమాధానం చెబుతుందని అభిమానులు భావించారు. అయితే ఢిల్లీ వన్డేలో బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రం అంచనాలకు తగ్గట్టే ఉన్నా… బ్యాట్స్‌మెన్ వైఫల్యం కొంపముంచింది. ధావన్ మళ్ళీ నిరాశపరిస్తే… కోహ్లీ, పంత్‌, విజయ్ శంకర్‌ కూడా త్వరగానే ఔటయ్యారు.

ఈ దశలో కేదార్ జాదవ్, భువనేశ్వర్ పోరాటం మాత్రం ఆకట్టుకుంది. ధాటిగా ఆడిన వీరిద్దరూ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించినా…చివర్లో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో ఒత్తిడిలో ఔటయ్యారు. దీంతో మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఓటమి ఖాయమైంది. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఓటమి భారత్‌కు షాక్‌గానే చెప్పాలి. వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న కోహ్లీసేన సొంతగడ్డపై సిరీస్ కోల్పోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఒకప్పటితో పోలిస్తే పెద్దగా బలంగా లేని ఆసీస్ చేతిలో ఓటమి భారత్‌కు మేలుకొలుపుగా భావిస్తున్నారు. నాలుగో స్థానంలో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ ఇప్పటి వరకూ కనిపించకపోవడం ప్రపంచకప్‌లో ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ప్రతీ మ్యాచ్‌లో బౌలర్ల కారణంగా విజయాన్ని ఆశించడం అత్యాశే. దీంతో బ్యాట్స్‌మెన్‌ స్థాయికి తగినట్టు ఆడితే తప్ప వచ్చే మెగా ఈవెంట్‌లో టీమిండియా అంచనాలను అందుకోలేదు.

Recommended For You