బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా.. ఇవి తెలిస్తే..

బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోస్తుంటాము. గులాబీ, కరివేపాకు లాంటి మొక్కలకు పోస్తే మంచి వాసన వస్తుందని పెద్దలు చెబుతుంటారు. మొక్కలకే కాదండి ముఖానికి కూడా మంచివి బియ్యం కడిగిన నీళ్లు. ఈ నీటితో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
2 స్పూన్ల బియ్యం నీటిలో 3 స్పూన్ల రోజ్‌వాటర్‌ని కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన టోనర్‌లా పని చేస్తుంది. పదినిమిషాలు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో కడుక్కుంటే ఫ్రెష్‌గా వుంటుంది.
2 స్పూన్ల బియ్యం నీటిలో 2 స్పూన్ల తేనెను కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 20 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో శుభ్రపరుచుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
కలబంద గుజ్జు రెండు స్పూన్లు తీసుకుని అందులో అంతే మోతాదులో బియ్యం కడిగిన నీటిని కలిపి మొటిమలు ఉన్న చోట రాసి 30 నిమిషాలు ఉంచుకుంటే మొటిమలు తగ్గుతాయి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


పాల పౌడర్‌లో బియ్యం నీటిని కలుపుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
4 స్పూన్ల బియ్యం నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
బియ్యం కడిగిన నీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వలన జుట్టుకి, చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. చైనీయుల జుట్టు పొడవుగా వుండడానికి కారణం వారు బియ్యం కడిగిన నీటితో జుట్టుని కడుగుతారట. జుట్టు కుదుళ్లకు పోషణ అంది పొడవుగా పెరుగుతాయట. మరి ఈ రోజు నుంచి బియ్యం నీటిని వృధాగా పారబోయకుండా ఉపయోగించుకుంటే మంచిది.

Recommended For You