చిత్రం.. భళారే విచిత్రం.. పెళ్లైన మూడు నిమిషాలకే..

పెళ్లికి ముందు ప్రేమ.. ఆమె అలిగితే అతడి హృదయం పగిలిపోయేది.. అలక తీర్చి వలపు ఉయ్యాలలో ఊగుతూ ఊసులెన్నో చెప్పుకునేవారు. ఓ ఫైన్ మార్నింగ్ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందామన్నారు కువైట్‌కి చెందిన ఓ జంట. కోర్టుకు వెళ్లి జడ్జి ముందు పెళ్లి చేసుకున్నారు.

అక్కడి నుంచి బయటకు వస్తున్న తరుణంలో వధువు వేసుకున్న డ్రెస్ కారణంగా అది తట్టుకుని కోర్టు మెట్టు మీద నుంచి కింద పడిపోయింది. పక్కనే ఉన్న వరుడు సహాయం చేయాల్సింది పోయి ఆమె పడిపోవడాన్ని అవమానంగా భావించాడు. ఆమె వైపు కోపంగా చూశాడు.

దాంతో ఆమెకు అతగాడి మీద కోపం నషాలానికి అంటింది. ఇప్పుడే కదా పెళ్లయింది. అప్పుడే భర్తగా అధారిటీ చూపిస్తున్నాడనుకుంది. వెంటనే.. జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడిగింది. ఆశ్చర్యపోయిన జడ్జి ఆమెను ఊరడించే ప్రయత్నం చేసారు.

అయినా ససేమిరా.. నేనెవ్వరి మాటను విననంది. చేసేదేంలేక జడ్జి పెళ్లి చేసిన మూడు నిమిషాలకే విడాకులను కూడా మంజూరు చేశాడు. కువైట్ చరిత్రలోని ఈ వార్త సెన్సేషన్‌గా నిలిచింది.

ఇంతకు ముందు దుబాయ్‌కి చెందిన ఓ జంట పెళ్లైన 15 నిమిషాలకే విడాకులు తీసుకుంటే ఈ జంట ఆ రికార్డుని అధిగమిస్తూ 3 నిమిషాలకే విడాకులు తీసుకుంది. ఇందులో కూడా రికార్డులు సృష్టించొచ్చా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Recommended For You