మద్యం తాగినంత మజాగా మూత్రాన్ని తాగేస్తూ..

అర్జంట్‌గా యూరిన్ వస్తే వెంటనే బాత్‌రూమ్‌కి పరిగెట్టేస్తారు. కానీ ఈయన మాత్రం ఓ బాటిల్ తీసుకుని అందులో నింపేస్తాడు. బాటిల్‌ని ఎత్తేసి హాపీగా మంచినీళ్లు తాగినట్టు తాగేస్తాడు.. వాక్.. వినడానికే అసహ్యంగా అనిపిస్తుంది కదా. నిజమేనండి.. గోమూత్రం తాగితే ఆరోగ్యానికి మంచిదని విన్నాము. కానీ ఎవరి మూత్రం వారే తాగితే కూడా మంచిదని ఎక్కడో చదివాడట. ఇంకేముంది గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అతనికి అదే సరైన మందుగా తోచింది. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసాడు. ఇప్పుడు తానెంతో ఆరోగ్యంగా ఉన్నానంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఇంగ్లండుకు చెందిన 37 ఏళ్ల ఫాబియన్ వృత్తిరీత్యా చాలా దూరం ప్రయాణించవలసి వచ్చేది. అందుకే ఇంటి భోజనం ఉండేది కాదు. దాంతో ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయవలసి వచ్చేది. ఒక్కోసారి జంక్ ఫుడ్ కూడా తినక తప్పని పరిస్థితి. దీని కారణంగా ఆరోగ్యం పాడైంది. దాంతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. ఎంత మంది వైద్యులను సంప్రదించినా కడుపునొప్పి తగ్గలేదు.

ఏదైనా పరిష్కారం లభిస్తుందేమోనని నెట్‌లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. చివరికి మనిషి మూత్రం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి తన మూత్రం తానే తాగడం మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుంచి తన మూత్రాన్ని వేస్ట్ చేయకుండా తాగేస్తున్నాడు. మూత్రం తాగడం మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదన్నాడు. పైగా తానెంతో ఆరోగ్యంగా ఉన్నానని భరోసా ఇస్తున్నాడు.

కడుపు నొప్పి తగ్గిపోవడంతో మూత్రంపై పరిశోధనలు చేయాలనిపించింది. మూత్రం టేస్ట్ గురించి వివరిస్తూ.. మద్యంలాగే వగరుగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది కానీ రుచిగా ఉండదు అని అంటున్నాడు. దీనిలో 95 శాతం నీళ్లు ఉంటే, 5 శాతం విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్స్ ఉంటాయని వివరిస్తున్నాడు. మనం తీసుకున్న నీరు రక్తంలో కలిసిన తరువాత ఎక్కువ వున్న నీటిని మూత్రపిండాలు వడకడతాయి. దాంతో పాటే బాడీకి పనికొచ్చేవన్నీ బయటకు వెళ్లి పోతున్నాయి అని ఫాబియన్ తన పరిశోధనల్లో తేల్చాడు. ఇక ఇప్పుడు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ, పండ్లు, అవిసెగింజలు లాంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ, మూత్రాన్ని తాగుతూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడట.

అయితే ఫాబియన్ పరిశోధనలతో డాక్టర్ రాబ్ హిక్స్ ఏకీభవించట్లేదు. గత కొన్నేళ్లుగా మనిషి మూత్రం మంచిదని చెబుతున్నారు. కానీ ఇంతవరకు దానిపై ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ జరగలేదన్నారు. నిజానికి మన శరీరంలోని కిడ్నీలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. మలినాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించి వేస్తాయి. అని ఆయన అన్నారు. చివరిగా మనిషి ఆరోగ్యంగా మనుగడ సాగించాలంటే మంచి ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం, పని ఒత్తిడిని తగ్గించుకుంటే సరిపోతుందని డాక్టర్ రాబ్ వివరించారు.

Recommended For You