సై అంటే సై.. సవాళ్లు ప్రతిసవాళ్లతో వేడెక్కిన విశాఖ రాజకీయాలు

సై అంటే సై.. సవాళ్లు ప్రతిసవాళ్లతో వేడెక్కిన విశాఖ రాజకీయాలు

సై అంటే సై అంటున్నారు.. సవాళ్లతో విశాఖ సాగరతీరంలో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.. టీడీపీ, వైసీపీ మధ్య నడుస్తున్న పొలిటికల్‌ తుఫాన్‌ ఇప్పుడు తీవ్రరూపం దాల్చుతోంది.. అక్రమాస్తులు, బినామీ భూములపై ప్రమాణానికి రావాలంటూ విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యే వెలగపూడి సవాల్‌ విసిరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి సద్దుమణిగినా, రాజకీయ వేడి మాత్రం రగులుతూనే ఉంది.

మొన్నటికి మొన్న తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సత్యప్రమాణాలు చేయగా.. అలాంటి పరిస్థితే విశాఖలోనూ కనిపించింది. బినామీ భూములు ఉన్నాయంటూ.. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై.. ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన వెలగపూడి.. తన సచ్ఛీలతను నిరూపించుకోవడానికి సిద్ధమన్నారు. ఈస్ట్ పాయింట్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానని వెలగపూడి ప్రకటించారు. ఏ సమయంలో రమ్మన్నా.. అక్కడికి వస్తానన్నారు. అటు వెలగపూడి చేసిన సవాల్‌ను విజయసాయిరెడ్డి పరోక్షంగా తోసిపుచ్చారు.

అయితే.. వెలగపూడిపై విశాఖ తూర్పు వైసీపీ నేతల్ని ఉసిగొల్పుతున్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. సవాల్‌ స్వీకరించాల్సింది ఒకరైతే.. తూర్పు వైసీపీ నేతలు రంగంలో దిగి.. రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సాయిబాబా ఆలయం దగ్గర పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ నేతలు వెలగపూడి ఇంటికి సాయిబాబా చిత్ర పటాన్ని తీసుకెళ్లడంతో మళ్లీ రగడ జరిగింది. అప్పటికే వెలగపూడి కార్యాలయం దగ్గరున్న టీడీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. భూకబ్జాలపై విజయసాయిరెడ్డి స్వయంగా ప్రమాణం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల నినాదాలతో టెన్షన్‌ వాతావరణం కనిపించింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

అటు.. దేశంలో నెంబర్‌ వన్‌ ఆర్థిక నేరస్థుడు విజయసాయిరెడ్డి అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. తాను సవాల్‌ విసిరింది విజయసాయిరెడ్డికి అయితే.. వేరే వాళ్లు వచ్చారంటూ మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి అని.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. విజయసాయిరెడ్డిని తీసుకొస్తే.. తాను సింహాద్రి అప్పన్న దగ్గరకు రావడానికి రెడీ అన్నారు వెలగపూడి.

మరోవైపు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి అండ్‌ కో భూములు దోచుకుంటున్నారని మాజీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. వైసీపీ నేతలు తమ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు విపక్షాలపై ఆరోపణణలు చేయడం సరికాదని అన్నారు. టీడీపీ నేతలు ఎప్పుడూ తప్పులు చేయలేదని తెలిపారు. టీడీపీ నేతలు తప్పు చేసి ఉంటే వైసీపీ నిరూపించాలని సవాల్‌ విసిరారు.

మొత్తంగా విశాఖ వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య నడస్తున్న ఈ పొలిటికల్‌ వార్‌ ఎంత దూరం వెళ్తుందోనన్న చర్చ ఇరు పార్టీల్లోనూ జరుగుతోంది.. వెలగపూడి సవాల్‌ను విజయసాయిరెడ్డి స్వీకరించి బాబా ఆలయంలో ప్రమాణం చేస్తారా..? చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story