పొంగులేటికి బ‌దులు.. ఆ వ్యాపార‌వేత్తకు టిక్కెట్..!

trs-mp-candidates-may-these

టీఆర్‌ఎస్‌ లోక్‌స‌భ అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారు. రేపోమాపో జాబితా విడుద‌ల చేయ‌నున్నారు గులాబీ బాస్. నాలుగైదు స్థానాల్లో మాత్రం కొత్త ముఖాల‌కు చోటు ద‌క్కనున్నట్టు స‌మాచారం. గ‌తంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారికి సైతం.. తాజా స‌ర్వేల‌తో ఝల‌క్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

ఖ‌మ్మంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సొంత పార్టీ అభ్యర్ధుల ఓట‌మికి ఎంపీనే బాధ్యుడని జిల్లా నేత‌లు ఆరోపించారు. దీంతో పొంగులేటికి టిక్కెట్ ఇవ్వద్దని అధిష్టానాన్ని జిల్లా నేత‌లు కోరిన‌ట్టు స‌మాచారం. దీంతో ఖ‌మ్మం ఎంపి టిక్కెట్ ఈసారి పొంగులేటికి బ‌దులు.. ప్రముఖ వ్యాపార‌వేత్త రాజేంద్రప్రసాద్‌కు ఇవ్వనున్నట్టు ప్రచారం జ‌రుగుతుంది. ఇక మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయ‌క్‌కు గ‌తంలో కేసీఆర్‌ టిక్కెట్ మ‌ళ్లీ ఇస్తాన‌ని ప్రక‌టించారు. కానీ తాజా ప‌రిణామాలతో ఆయనకు టిక్కెట్ లేన‌ట్టే అని తెలుస్తుంది. ఆయ‌న స్థానంలో రెడ్యానాయ‌క్ కూతురు మాజీ ఎమ్మెల్యే క‌విత‌కు టిక్కెట్ ఇవ్వనున్నట్టు స‌మాచారం.

మ‌హ‌బూబ్‌నగ‌ర్ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌ల‌ను బ‌రిలో ఉంచార‌ని ఆ జిల్లా నేత‌లు ఆరోపించారు. జితేంద‌ర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు గ‌త రెండేళ్లుగా ప్రచారం జ‌రిగింది. దీంతో జితేంద‌ర్‌రెడ్డి స్థానంలో వ్యాపార‌వేత్త మ‌న్నే స‌త్యనారాయ‌ణరెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్దమైన‌ట్టు సమాచారం. ఇక మ‌ల్కాజ్‌గిరిలో వెల‌మ సామిజిక వ‌ర్గానికి చెందిన న‌వీన్ రావ్.. మంత్రి మ‌ల్లారెడ్ది అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పోటీ ప‌డుతున్నారు. సికింద్రాబాద్‌ టిక్కెట్‌ దండే విఠ‌ల్, మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ కొడుకు సాయి కిర‌ణ్ విశ్వప్రయ‌త్నం చేస్తున్నారు.

అటు.. న‌ల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా పోటీకి ఆస‌క్తి చూప‌కపోవ‌డంతో ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన‌ప‌రెడ్డి, చాడా కిష‌న్‌రెడ్డిలు టిక్కెట్ కోసం ప్రయ‌త్నిస్తున్నారు. చేవెళ్ల ఇంట్రస్ట్‌గా మారింది. స‌బితా ఇంద్రారెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్‌లో చేర‌నుండ‌టంతో స‌మీక‌ర‌ణాలు మారాయి. కార్తీక్ రెడ్డికి ఇస్తారా లేదంటే రంజిత్ రెడ్డికి అవ‌కాశం ద‌క్కుతుందా చూడాలి.

ఇప్పటి వరకు ఎనిమిది స్థానాల్లో అభ్యర్దులు ఖ‌రారయ్యారు. నిజామాబాద్ నుంచి క‌ల్వకుంట్ల క‌విత‌, మెద‌క్ కొత్త ప్రభాక‌ర్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, భువ‌న‌గిరి బూర నర్సయ్య గౌడ్, ఆదిలాబాద్ న‌గేశ్, నాగర్ కర్నూల్‌లో మాజీ మ‌ంత్రి పి.రాములు, వరంగల్ నుంచి ప‌సునూరి దయాకర్, పెద్దప‌ల్లి నుంచి జి.వివేక్‌ల‌కు టిక్కెట్ ఫైన‌ల్ అయిన‌ట్టు తెలుస్తుంది.