‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’ మూవీ రివ్యూ..

bilal pur police station movie review

నిర్మాణ సంస్థ – ఎంఎస్ క్రియేషన్స్
నటీనటులు – మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు
సాంకేతిక వర్గం – సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా,
కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్,
రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

కథ విషయానికి వస్తే..
బిలాల్ పూర్ అనే ఊరికి కొత్తగా యువ పోలీసు అధికారి సూర్య (మాగంటి శ్రీనాథ్) వస్తాడు. పోలీసు వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవాలన్నది అతని కోరిక. సంఘ విద్రోహుల ఆనవాళ్లు లేకుండా చేయాలని అనుకుంటాడు. ఇలాంటి ఆశయాలతో బిలాల్ పూర్ వచ్చిన సూర్యకు అక్కడ స్థానికంగా జరిగే గొడవలు చికాకు కలిగిస్తుంటాయి. కోడి పోయిందని, విందులో మాంసం వడ్డించలేదని, దూడ పొడిచిందనే కేసులు స్టేషన్ కు వస్తుంటాయి. ఈ చిన్న చిన్న కేసులను చట్టప్రకారం ఎలా పరిష్కరించాలో అర్థం కాక అసహనానికి గురవుతుంటాడు సూర్య. సూర్య పనిచేసే స్టేషన్ లోనే సురేందర్ (గోరటి వెంకన్న) అనే హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తుంటారు. ఊరిలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి సురేందర్ ను అంతా తమ మనిషిగానే భావిస్తుంటారు. వృత్తిపరంగా పోలీస్ అయినా…అంతా బావా, అన్నా, బాబాయ్ అంటూ కలుపుగోలుగా ఉంటారు. ఈ క్రమంలో ఊరి వాళ్ల అతి చనువు పోలీసులకు ఇబ్బందిగా మారుతుంది. సురేందర్ మంచితనం సూర్యకు నచ్చదు. కఠినంగా ఉంటాలని సూచిస్తాడు. అయినా పరిస్థితి మారదు. సురేందర్ కూతురు శ్రీలత (శాన్వీ మేఘన) పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు సూర్య. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మరోవైపు ఊరిలో కొందరు కుర్రాళ్లు చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడుతుంటారు. వీళ్లను పట్టుకునేందుకు సూర్య ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఊరిలో జరిగిన ఓ ఘోర ఘటన పోలీసులకు సవాలులా మారుతుంది. ఆ సంఘటన ఏంటి? దాన్ని పోలీసు అధికారి సూర్య ఎలా మార్చాడన్నది ఆసక్తికరంగా సాగే ముగింపు.

కథనం :
ఎంత పెద్ద నగరాల్లో నివసిస్తున్నా…మన మూలాలన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. అందుకే పల్లెటూరి సంగతులు, అక్కడి కథలు, సన్నివేశాలు మన మనసులకు హత్తుకుంటాయి. గత జ్ఞాపకాలు గుర్తుకుతెస్తాయి. సినిమాల్లో ఇలాంటి కథలు తక్కువ. తెలుగు కథ గ్రామీణ నేపథ్య లోకి వెళుతోంది, ప్రేక్షకాదరణ పొండుతుంది. తాజాగా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా అలాంటి అనుభూతినే అందిస్తోంది. ఇక్కడా కథను కట్ చేయకుండా అన్ని ఎమోషన్స్ చాలా సహజంగా పలి కించాడు దర్శకుడు నాగ సాయి. కథకు ఎంచుకున్న నేపద్యంలో కథను ముగించాడు. పాత్రలు, వాటి ప్రవర్తన చాలా సహజంగా ఉన్నాయి. దొంగ పోలీస్ పాత్ర చేసిన నటుడు ఆర్ ఎస్ నందా బాగా నవ్వించాడు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్లలో జరిగిన సంఘటన మనం నిత్యం వార్తల్లో కనిపించేవే. సమాజంలో ప్రేమ పేరుతో కక్కుతున్న ద్వేషం ఎంత క్రూరంగా ఉంటుందో ఈ సినిమా మరోసారి చూపెట్టింది.

నటీనటుల ప్రతిభ..
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రానికి మూల స్తంభంలా నిలిచారు గాయకుడు గోరటి వెంకన్న. హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. మన ఊరిలో చూసే పోలీసు బాబాయ్ లా సహజంగా నటించారు వెంకన్న. వినోద సన్నివేశాల్లో వెంకన్న నటన ఎంతగా నవ్విస్తుందో…పోలీసు వృత్తిలో బాధలను వివరించే క్రమంలో అంత భావోద్వేగాలతో సాగుతుంది. యువ పోలీసు అధికారి సూర్యగా మాగంటి శ్రీనాథ్ పాత్రోచితంగా నటించారు. యువ అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఆయన నటనలో కనిపించాయి. శాన్వీ మేఘన అందమే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది. గ్రామంలో మనకు తెలిసిన అందమైన అమ్మాయిని గుర్తుకుతెస్తుంది.ఆర్ ఎస్ నందా ఉన్న సన్నివేశాలన్నీ నవ్వులు ఆర్ ఎస్ నందా. వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితనం…
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ఆద్యంతం సహజంగా, వినోదాత్మకంగా మలచడంలో యువ దర్శకుడు నాగసాయి మాకం విజయం సాధించారు. కొత్త దర్శకుడైనా ఎక్కడా తడబడకుండా వాణిజ్య అంశాలతో మేళవించి సినిమాను రూపొందించారు. మన చుట్టూ జరుగుతున్న కథలాగే బిలాల్ పూర్ సాగేలా చేశారు. తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. పల్లె అందాలను తెరకెక్కించడంలో ఆయన కెమెరా కన్ను కొత్త పుంతలు తొక్కింది. పోలీస్ గొప్పదనం చెబుతూ సుద్దాల అశోక్ తేజ రాసిన నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ అనే పాట ఆయన సాహిత్య స్థాయిని చూపించింది. గోరటి వెంకన్న, మౌనశ్రీ మల్లిక్ పాటలు సాహిత్య విలువలతో సాగాయి. సాబూ వర్గీస్ సంగీతం కథకు మరింత బలాన్నిచ్చింది. ఎంఎస్ క్రియేషన్స్ సంస్థ ఉన్నత నిర్మాణ విలువలు ఉన్నాయి. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ కు తొలి చిత్రమైనా మంచి సినిమా చేయాలనుకునే తన అభిరుచి చూపించారు.

చివరిగా :
సమాజంలో కనిపిస్తున్న సమస్యలను తీసుకొని సినిమా గా మాలచడం లో టీం విజయం సాధించింది. సహజ మైన కథా, కథనాలు కోరుకునే వారికి బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ నచ్చుతుంది.

Recommended For You