ఆవిడ మీద అలిగి రోడ్డు మీద నిలబడినందుకు.. వీడియో వైరల్

రోజూ పార్టీలంటూ పెగ్గేసి లేటుగా ఇంటికొస్తున్న భర్తని గుమ్మంలోనే నిలదీసింది భార్య. దానికి భర్త రోడ్డెక్కాడు. చైనాలోని ఝొంజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే వ్యక్తి పీకలదాకా మద్యం తాగి తూలుతూ ఇంటికి వచ్చాడు. భార్య చీవాట్లు పెట్టేసరికి ఇంట్లోకి కూడా వెళ్లకుండా వెనుదిరిగాడు. అసలే వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉన్న ఆ రోడ్డులో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భావించిన భార్య.. సరే రావయ్యా బాబు.. నీకెన్ని సార్లు చెప్పినా బుద్ది రాదు, నువ్ మారవు అని చెయ్యి పట్టుకుని అతడిని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది..

భార్యపై అలిగిన భర్త నేను రాను పొమ్మన్నాడు. సరే నీ ఖర్మ అని వదిలేసి తానొక్కతే ఇంట్లోకి వెళ్లింది. రోడ్డుకి అడ్డంగా నిల్చున్న అతగాడిని స్పీడుగా వస్తున్న ఓ వాహనం గుద్దేసి అంతే వేగంతో వెళ్లిపోయింది. ఫలితంగా పాన్ హాస్పిటల్‌పై బెడ్ మీద ఆపసోపాలు పడుతున్నాడు. అయ్యో నా భార్య మాట వినకపోతినే అని నెత్తీ నోరు మొత్తుకుంటున్నాడు. తలకు, ఛాతికీ తీవ్ర గాయాలవ్వడంతో చావు తప్పి కన్ను లొట్ట పోయినంతపనైంది పాన్‌కి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న భర్తకి సపర్యలు చేయక తప్పని పరిస్థితి పాపం భార్యది.