వారికే పెద్దపీట వేసిన చంద్రబాబు

tdp tickets meeting in amaravati

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్న చంద్రబాబు ఎన్నో కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. సామాజిక సమీకరణలు,సర్వే రిపోర్టులతో గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టారు.సీనియార్టీకి పెద్ద పీట వేశారు. గెలుపే లక్ష్యంగా ఎక్కడా మొహమాటలకు పోలేదు. మంత్రుల స్థానాలను మార్చారు. ఎంతో కాలంగా పార్టీకి సేవలందించి, విశ్రాంతి తీసుకుంటామన్న సీనియర్ల వినతిని పరిగణలోకి తీసుకొని వారి వారసులకు టిక్కెట్లు ఇచ్చారు. కొందరు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. అదేసమయంలో ఏకాభిప్రాయం కుదరని స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్‌ లో ఉంచారు.

టీడీపీ తొలి జాబితాలో సిట్టింగ్‌లకు ప్రాధాన్యం దక్కింది. గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసిన చాలా మందికి పాత స్థానాలే ఖరారయ్యాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే. మంత్రి జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరు మార్చారు చంద్రబాబు. విశాఖ జిల్లా పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు స్థానాన్ని కేటాయించారు. భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాస రావును విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దించుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రి నారా లోకేశ్, డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. లోకేశ్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి, డొక్కా ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు బాపట్ల సిట్టింగ్ ఎంపీ శ్రీరాం మాల్యాద్రికి గుంటూరు జిల్లా తాడికొండ సీటు కేటాయించారు.

ఇక తొలి జాబితాలో 10 మంది వారసులకు సీటు దక్కింది. పలాస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ తనయ శిరీష బరిలోకి దిగనున్నారు. చీపురుపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున, తల్లి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానికి రాజమండ్రి అర్బన్ టిక్కెట్‌ కేటాయించారు. సీనియర్ పొలిటిషియన్ దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్‌కు కృష్ణా జిల్లా గుడివాడ టికెట్ ఇచ్చారు. విజయవాడ వెస్ట్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కూతురు షబానా ఖాతూన్ తండ్రి స్థానం నుంచే పోటీ చేయనున్నారు. వీరందరూ తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు.

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి స్వస్తి పలికి తన వారసున్ని రంగంలోకి దించుతున్నారు. కేఈ తనయుడు శ్యామ్‌ కు తండ్రి సీటును కేటాయించారు చంద్రబాబు. ఇక మంత్రి పరిటాల సునీత సిట్టింగ్ స్థానమైన రాప్తాడు నుంచి సునీత తనయుడు శ్రీరాం బరిలోకి దిగుతున్నారు. అనారోగ్య కారణాలతో శ్రీకాళహస్తి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోపాలకృష్ణా రెడ్డి ఈసారి పోటీ చేయడం లేదు. ఈ స్థానాన్ని బొజ్జల తన తనయుడు సుధీర్ రెడ్డికి కేటాయించారు. ఇక మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుకు నగరి టిక్కెట్‌ ఇచ్చారు.

మరోవైపు ఏకాభిప్రాయం రాలేక పోయిన టిక్కెట్లను పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని సింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చాల్సిందేని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీటిని పక్కన పెట్టారు. జిల్లాల వారీగా పెండింగ్ స్థానాల విషయానికివస్తే, శ్రీకాకుళం జిల్లాలో 9 స్థానాలు ఖరారు కాగా, ఒక స్థానాన్ని పక్కన పెట్టారు. విజయనగరం జిల్లాలో 7 సీట్లు ఖరారయ్యాయి. 2 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. విశాఖ జిల్లాలో 10 స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు . 5 సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 16 సీట్లు ఖరారు కాగా, 03 సీట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. 04 స్థానాలకు వడపోత జరుగుతోంది. కృష్ణా జిల్లాలో 14 సీట్లు ఖరారయ్యాయి. 2 సీట్లను పక్కన పెట్టారు. గుంటూరు జిల్లాలో 14 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. 3 సీట్లను పెండింగ్లో ఉంచారు. ప్రకాశం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 4, కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 5 సీట్లను పక్కన పెట్టారు. అనంతపురం జిల్లాలో ఏకంగా 9 సీట్లను పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో 14 సీట్లలో 6 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. టీడీపీ తొలిజాబితాలో సామాజిక కోణాన్ని పరిశీలిస్తే, 72 మంది ఓసీలున్నారు. 31 మంది బీసీ, 17 మంది ఎస్సీ, నలుగురు ఎస్టీలు, ఇద్దరు మైనార్టీలకు అవకాశం దక్కింది.

Recommended For You