37 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీలో 22 ఏళ్లు అధికారంలో ఉన్నాం : సీఎం చంద్రబాబు

cm chandrababunaidu press meet

అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్ధులను ప్రకటించడం చరిత్రలోనే ఇదే తొలిసారని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశామన్నారు. కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే అభ్యర్ధులను ఎంపిక చేశామన్నారు. టికెట్‌ రానివారెవ్వరికీ నిరాశ వద్దని.. రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

జరిగేవి ప్రజా ఎన్నికలని.. వారి మనోభావాలకు తగ్గట్టే అభ్యర్ధులను ఖరారు చేశామన్నారు చంద్రబాబు. కులమత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి చేశామన్నారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీలో 22 ఏళ్లు అధికారంలో ఉన్నామన్నారు. అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనన్నారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్లకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అందరికీ మిషన్‌ 150 ప్లస్‌ పోటీ పెట్టామని.. 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని సూచించారు. టీడీపీ వదిలి వెళ్లిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నారు. 25 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి తేగలమని, హామీలు సాధించగలమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ పెరగాలని.. కుప్పం స్ఫూర్తి అన్ని నియోజకవర్గాల్లో రావాలన్నారు చంద్రబాబు. ఓటు మార్పు చేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు.

Recommended For You