ఆ స్థానాలు మాకే.. జనసేనకు రిక్వెస్ట్..

janasena meets with cpm and cpi leaders

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిపోయిన లెఫ్ట్ పార్టీలు..ఇప్పుడు ఎన్నికలంటేనే గడ్డుకాలంగా భావిస్తున్నాయి. లెఫ్ట్ పార్టీల టికెట్ కోసం ఎగబడిన పాతవైభవం చెదిరిపోయింది. ఇప్పుడు టికెట్లు ఇస్తామని సీపీఐ, సీపీఎం గాలిస్తున్నా.. అభ్యర్ధులు దొరకని పరిస్థితి దాపురించింది. పొలిటికల్ ఉనికి కోసం పాకులాడుతున్న కమ్యూనిస్ట్ పార్టీలు 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి. అయితే..పొత్తులోనూ తమకు కావాల్సిన టికెట్ల విషయంలో పట్టువిడుపుల ధోరణి తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి.

మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో సీపీఐ, సీపీఐ కలిపి 26 అసెంబ్లీ సీట్లను అడుగుతున్నాయి. 4 ఎంపీ స్థానాలను కేటాయించాలని కోరుతున్నాయి. పార్టీల వారీగా ఆయా అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ నియోజకవర్గాల లిస్టును ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు పంపించాయి. జిల్లాకు ఓ అసెంబ్లీ సీటు చొప్పున సీపీఐ 13 ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తోంది. అలాగే విశాఖపట్నం, కర్నూలు ఎంపీ టికెట్లు కూడా తమకే కేటాయించాలని అంటోంది. అటు సీపీఎం తమకు రంపచోడవరం, గాజువాక, విజయవాడ సెంట్రల్, మంగళగిరి, కర్నూలుతో పాటు ఉండి, నెల్లూరు అర్బన్ బద్దేల్ నియోజకవర్గాలను కావాలని కోరుతోంది.

అయితే..జనసేన తమ తొలి జాబితా ఇప్పటికే ప్రకటించింది. రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్ధులను కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం సీపీఎం కోరుతున్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్, గాజువాక, మంగళగిరి, కర్నూలు స్థానాలను కేటాయించేందుకు పవన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అటు సీపీఐ కోరుతున్న విజయవాడ పశ్చిమ సీటుపై కూడా ప్రతిష్టంభన నెలకొంది. సెంటిమెంట్ పరంగా విజయవాడ పశ్చిమ సీటు తమకు కీలకమని సీపీఐ వాదిస్తోంది. అయితే..ఇక్కడి నుంచి జనసేన తరపున మహేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. తొలి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకే సీటు కేటాయించాలని మహేష్ పట్టుబడుతున్నారు. దీంతో విజయవాడ పశ్చిమ సీటు విషయంలో జనసేన, సీపీఐ మధ్య కనిపించని వివాదం కొనసాగుతోంది. అయితే..లెఫ్ట్ పార్టీలు పట్టుబడుతున్న స్థానాల్లో ఆయా పార్టీల బలాబలాలపై సమీకరణాలు పరిశీలిస్తున్నారు. సమీకరణాలు పైనల్ అయ్యాకే సీట్ల కేటాయింపుపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పొత్తు పంపకాలు ఆలస్యం అవుతుండటంతో సీపీఐ, సీపీఎం నేతలు కంగారు పడుతున్నారు.