అక్కడో విచిత్ర పరిస్థితి.. జైలుకు వెళ్లడానికే దొంగతనం..

చేసిన తప్పుకు కఠిన శిక్షలు అనుభవించి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు ఏ అవకాశం దొరికినా బయటకు రావాలని చూస్తుంటారు. మరి అలాంటిది మాకు జైలే బావుంది అక్కడికే వెళ్తాం అంటూ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ జైలుకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు జపాన్ దేశానికి చెందిన వృద్ధులు. చేతికి అంది వచ్చిన కొడుకు చేయి పట్టుకుని నడిపిస్తాడనుకుంటే ఉద్యోగాల నిమిత్తం దూరంగా వెళిపోతున్నారు. ఫలితంగా పెద్దవాళ్లు ఒక్కరే ఒంటరిగా ఇళ్లలో మిగిలి పోతున్నారు. పలకరించే వాళ్లు లేక, పట్టించుకునే వాళ్లు లేక నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళుతున్నారు. అక్కడ నలుగురి మధ్యలో ఉంటాం.. వేళకు ఇంత పెడతారు అది తిని పడుకుంటాం. ఈ వయసులో ఇంతకంటే కావలసింది ఏముంటుంది అని అంటున్నారు.


జపాన్ జనాభా మొత్తం 13 కోట్లు ఉంటే అందులో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధుల సంఖ్య 12 శాతానికి పైగా ఉంది. మరణాల రేటు తగ్గడంతో వయసు పైబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. వీరికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కూడా అంతంత మాత్రమే. దీంతో దొంగతనాలు చేసి, కత్తులతో బెదిరించి నేరాలు చేస్తూ పట్టుబడి మరీ జైలుకు వెళుతున్నారు. ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతోంది. గత ఏడాది చివరి వరకు జైళ్లలో ఉన్న ఖైదీల్లో 18 శాతం 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఉన్నారని తెలిసింది. కనీచీ యెముడా అనే వృద్ధుడు 85 ఏళ్ల వయసులోనూ 20వ సారి నేరం చేసి జైలుకు వెళ్లేందుకు సిద్ధపడడం చూస్తుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి మరింతగా దిగజారకుండా ఉండేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.