ఇంటర్ అర్హతతో.. జ్యూయలరీ డిజైనింగ్‌..

క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారా.. జ్యూయలరీ డిజైనింగ్‌ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారా.. ఇలాంటి కోర్సులు మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగానూ నిలబెడతాయి. మగువకు చిరునవ్వే చక్కని ఆభరణం అని తెలిసినా.. చిన్న నగైనా పెట్టుకోపోతే మోము చిన్నబుచ్చుకుంటుంది. చూపరులను ఆకర్షించే నగలు పెట్టుకోవాలని ప్రతి వనితా కోరుకుంటుంది. అందుకే జ్యూయెలరీ డిజైనింగ్‌కి గిరాకీ పెరుగుతోంది. దీన్ని వృత్తిగా తీసుకునే వారి సంఖ్యా ఎక్కువవుతోంది.
ఆధునిక మహిళ సంప్రదాయాన్ని కోరుకుంటూనే వాటికి లేటెస్ట్ మెరుగులు దిద్దాలనుకుంటోంది. ఫ్యాషన్‌కి అనుగుణంగా దుస్తులతో పాటు నగలూ ఉండాలని కోరుకుంటోంది.
సృజనాత్మకంగా ఆలోచించే వారు ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉంటాయి. కాస్త ఓర్పు, డిఫరెంట్‌గా ఆలోచించే నేర్పు ఉన్న వాళ్లకు ఇది ఎంతో అనువైన రంగం. శిక్షణ కాలంలో ఆభరణాల తయారీకి అవసరమైన మెలకువలను నేర్పిస్తారు. మన దేశంలోని అనేక విద్యా సంస్థలు ఈ రంగంలో దీర్ఘ/స్వల్ప కాలవ్యవధి కోర్సులను అందిస్తున్నాయి.


కోర్సు చేయడానికి అర్హతలు..
స్వల్పకాల వ్యవధి కోర్సులో ప్రవేశానికి ఇంటర్ పాసైనవారు అర్హులు.
డిప్లొమా కోర్సు చేయాలంటే ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
జ్యూయలరీ డిజైనింగ్‌ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన తరువాత దేశంలోని పేరున్న ఆభరణాల సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయవచ్చు.
డిజైనింగ్ కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు..
సొలిటైర్ డైమండ్ ఇనిస్టిట్యూట్, గోల్కొడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్, హైదరాబాద్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యుయెలరీ, న్యూఢిల్లీ, ముంబయి
జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ముంబయి
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జ్యుయెలరీ, ముంబయి
పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, ఢిల్లీ, జయపుర, ముంబయి, నొయిడా
ఆర్క్ అకాడమీ ఆఫ్ డిజైన్, జయపుర


కోర్సులో నేర్పే అంశాలు..
రాళ్లను కట్ చేయడం, చెక్కడం, సానబెట్టడం, విలువైన లోహాలు, రాళ్ల నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇస్తారు.
లోహాలకు రంగులు అద్దడం, విద్యుత్ సాయంతో ఒక లోహంపై వివిధ లోహాలను పూత పూయడం, లోహాలపై ఎనామిల్ పూత వేయడం, డిజైన్‌కు అనుగుణంగా లోహాలపై రాళ్లను పద్దతిగా అమర్చడం, కంప్యూటర్ సాయంతో నగల డిజైన్లు, నగలను తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు. లేటెస్ట్ టెక్నాలజీతో నగలను రూపొందించడం నేర్పిస్తారు.
ఆభరణాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ కోర్సు పూర్తి చేసిన వారికి దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.
డిజైనింగ్‌కి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు..
ఫౌండేషన్ కోర్సు
ఇండస్ట్రీ ఓరియంటెడ్ డిజైన్
కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్
స్టయిల్స్ ఆఫ్ జ్యూయెలరీ డిజైన్,
జ్యుయెలరీ డిజైన్ డిప్లొమా
జ్యూయెలరీ టెక్నాలజీ డిప్లొమా – బేసిక్, డిప్లొమా ఇన్ జ్యుయెలరీ డిజైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్, జ్యూయెలరీ ఇన్ ఆర్గనైజ్డ్ రిటైల్ అండ్ లైఫ్ స్టయిల్ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్ ఇన్ జ్యూయెలరీ సీఏడీ టెక్నాలజీ-రైడో-3డి, సర్టిఫికెట్ ఇన్ జ్యూయెలరీ సీఏడీ టెక్నాలజీ- ఇన్నోవేట్- మాట్రిక్స్, సర్టిఫికెట్ ఇన్ డైమండ్ గ్రేడింగ్
సర్టిఫికెట్ ఇన్ జెమాలజీ(ఇంటర్ పాసైనవారు అర్హులు)
జ్యూయెలరీ టెక్నాలజీ డిప్లొమా- అడ్వాన్స్, డైమండ్స్ అండ్ డైమండ్ గ్రేడింగ్, కలర్డ్ జెమ్‌స్టోన్ ఐడెంటిఫికేషన్ అండ్ డిప్లొమా ఇన్ జెమాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జ్యూయెలరీ మేనేజ్‌మెంట్, మాస్టర్ మెడల్ మేకింగ్ (ఈ కోర్సులకు డిగ్రీ పాసైనవారు అర్హులు)
కొన్ని సంస్థలు దూరవిద్య ద్వారా కూడా ఈ కోర్సులను పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
కోర్సు ఫీజు..
ఏడాది లేదా రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సు పూర్తి చేయడానికి సుమారు రూ.65,000 నుంచి 1,80,000 వరకు ఖర్చవుతుంది. తక్కువ కాలవ్యవధి ఉన్న కోర్సు పూర్తి చేయడానికి రూ.15,000 నుంచి 65,000 వరకు ఖర్చవుతుంది.


కోర్సు పూర్తి చేసిన వారికి వేతనాలు ఈ విధంగా ఉంటాయి..
మొదట్లో రూ.10,000 వరకు ఉంటుంది. అనుభవం పెరిగినకొద్దీ నెలకు రూ.20,000 వరకు ఇస్తారు. మీ మీ క్రియేటివ్‌ని బట్టి మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంటే నెలకు రూ.1,00,000 వరకు సంపాదించవచ్చు. అనుభవం ద్వారా ప్రముఖ ఆభరణాల సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. జ్యూయెలరీ షాపులు, షోరూముల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. జ్యూయెలరీ ఎగ్జిబిషన్లకు హాజరవడం, నలుగురితో పరిచయాలు మీ కెరీర్లో ఎదగడానికి దోహదపడతాయి.

Recommended For You