తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించిన కృష్ణానది యాజ‌మాన్య బోర్డు

Krishna rivar board that gave good news to Telugu states

తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది యాజ‌మాన్య బోర్డు శుభవార్త అందించింది. వేసవి కాలంలో నీటి సమస్యను తీర్చడానికి కృష్ణా బేసిన్ లోని నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని తెలంగాణ, ఏపీకి పంపిణీ చేసింది. మే నెల వరకు ఇరు రాష్ట్రాలకు అవసరమైన నీటి విడుదల కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. వేస‌వికాలం కావ‌డంతో రిజ‌ర్వాయర్లలో ఆవిరి కాగా మిగిలిన ఉన్న నీటిని రెండు రాష్ట్రాల మధ్య కేటాయించింది. గతంలో ఉన్న 66 :34 నిష్పత్తిలోనే ప్రస్తుతం ఉన్న నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఏపీకి 17.5, తెలంగాణ కు 29 టీఎంసీలు మంజూరు చేసింది.

ప్రస్తుతం శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ లో 18, నాగార్జున సాగర్ రిజ‌ర్వాయ‌ర్ లో 33.7 టీఏంసీల నీరు నిల్వ ఉంది. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లకు శ్రీశైలం రిజర్వాయ‌ర్ నుంచి మ‌హాత్మా గాంధీ క‌ల్వకుర్తి ఎత్తిపోత‌ల ప‌థకానికి ఆగ‌స్టు వ‌ర‌కు 3.5 టీఎంసీలు, మిషన్ భగీరథకు 5 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 8.5 టీఎంసీలు, ఎఎమర్పీకి చెరువుల కోసం 3 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 9 టీఎంసీలను కేటాయించారు.

ఇక ఏపీలోని హంద్రీనీవా, ముచ్చుమర్రికి 3 టీఎంసీలు, సాగర్ కుడి కాలవకు 8 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 3 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 3.5 టీఎంసీలు కేటాయించింది కృష్ణాన‌ది యాజ‌మాన్య బోర్డు.

ఇక ఏపీ సర్కారు నిర్దేశించిన కోటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని, త్రిసభ్య కమిటీకి, కృష్ణాబోర్డుకు, సెంట్రల్ వాటర్ కమిషన్ లకు తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. కృష్ణానది యాజ‌మాన్య బోర్డు మీటింగ్ కు ముందు వ‌ర‌కు కూడా ఏపీకి అద‌నంగా చుక్క నీటిని విడుద‌ల చేసిన ఊరుకునేది లేద‌ని హెచ్చరించిన తెలంగాణ…. స‌మావేశంలో ఏపీ చెప్పిన విష‌యాల‌కు సానుకులంగా స్పందించింది. వేసవి అవసరాల కోసం ఖచ్చితంగా నీరు కావాలన్న వినతిని మన్నించింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధికారులు పరస్పర అంగీకరించడంతో నీటి కేటాయింపుల ప్రక్రియ సులువుగానే ముగిసింది. శ్రీశైలం, సాగర్ లో నీటి నిల్వల కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ హర్షం వ్యక్తం చేసింది. అయితే తెలంగాణకు దక్కిన నీటిపై ఇంజ‌నీర్ ఇన్ ఛీఫ్ ముర‌ళీధ‌ర్ ఎలాంటి స‌మాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.