ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

tdp

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా తయారైంది ఒంగోలు పార్లమెంటు నియోజక వర్గంలో TDP పరిస్థితి. 1984 నుంచి 2014 వరకు 35 ఏళ్లలో ఒంగోలు పార్లమెంటుకు 9 దఫాలుగా ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాం ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ ఆరుసార్లు, వైసీపీ మరోసారి గెలిచాయి. తొలి నుంచి ఈ తెలుగుదేశం పార్టీ పెద్దగా దృష్టి పెట్టకపోవడమే ఇక్కడ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. అసెంబ్లీ సెగ్మెంట్లు బాధ్యతలను చూసే ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు కేవలం తమ గెలుపు కోసమే కృషి చేసుకుంటూ పార్లమెంటు అభ్యర్థికి ఓటు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఓటమి చవిచూస్తున్నాడు. మరో కోణంలో ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో రెడ్డి, యాదవ, వైశ్య సామాజిక వర్గాలు అధికంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టిన టీడీపీ పూర్తిస్థాయిలో నియోజకవర్గాల క్యాడర్ నుంచి ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలో విఫలమవడంతోనే స్వల్ప ఓట్లతో టీడీపీ అభ్యర్థి మాగుంట పరాజయం పొందారు.

దీనికి ముఖ్యంగా ఆ స్థానం పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు టీడీపీ గెలిచినా ఆ మేరకు ఓట్లు మాగుంటకు పోల్ కాకుండా క్రాస్ ఓటింగ్ జరగడమే ప్రధాన కారణంగా మారింది. ఈ క్రాస్ ఓటింగ్ కి అడ్డుకట్ట వేసి ఉంటే టీడీపీకి ప్రస్తుతం అభ్యర్థిని వెతుక్కునే పరిస్థితి ఉండేది కాదు .గతంలో జరిగిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకున్న TDP ఈ సారి ఒంగోలు పార్లమెంటు పరిధిలో జెండా ఎగురవేయడానికి గట్టి ప్రణాళికతో వస్తుంది. అందుకోసం ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి శిద్ధా రాఘవరావుని ఒంగోలు పార్లమెంటు బరిలొకి రంగంలోకి దింపింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సుపరిచితుడు, రాష్ట్ర మంత్రిగా అన్నీ నియోజకవర్గనేతలతో బలమైన సంబంధాలు శిద్ధాకి కలిసివస్తాయని అధిష్టానం భావిస్తోంది. దీనికి తోడు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శిద్ధాకు చెందిన వైశ్య సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా లక్ష 40వేల వరకు ఉండటం శిధ్ధాకు కలిసివచ్చే అవకాశం.

వైసీపీలో రాజకీయ విభేదాలు కూడా శిద్ధాని పార్లమెంటుకి సునాయసంగా పంపే సూచనలే కనిపిస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వైవీ సుబ్బారెడ్డికి ఇప్పుడు టిక్కెట్ నిరాకరించడం జరిగింది. వైవీ ఎంపీగా ఉన్న సమయంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో సొంత వర్గాన్ని తయారుచేసుకున్నారు . ప్రస్తుతం ఒంగోలు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట వల్లే తనకు టిక్కెట్ రాలేదన్న అభిప్రాయంతో ఉన్న వైవీ… మాగుంట మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. మాగుంట తోనే కాక పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులరెడ్డితో కూడా వైవీ సుబ్బారెడ్డికి విభేధాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం వైవీ వర్గం ఒంగోలు ఎంపీ అభ్యర్థికి కాని ఎమ్మెల్యే అభ్యర్థి కి కాని సహకరించే పరిస్థితి లేదు . పార్లమెంటు పరిధిలో గట్టి పట్టున్న వైవీ మద్దతు లేకుంగా ఒంగోలు ఎంపీగా గెలవడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శిద్దా రాఘవరావు సామాజికవర్గం, ఆర్ధికబలం, వైసీపీలో వర్గపోరు కలిసి విజయాన్ని అందిస్తాయని నమ్ముతున్నారు.

Recommended For You