నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై సందిగ్థత

tdp

126 అసెంబ్లీ సీట్లను ఫైనల్ చేసిన టీడీపీ..మిగిలిన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ లిస్ట్ పై తుది కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారిగా చంద్రబాబు వరుస సమీక్షలతో అభ్యర్ధులపై ఓ అవగాహనకు వస్తున్నారు. దీంతో ఆశావహులు తమ వాయిస్ వినిపించే ప్రయత్నంలో ఉన్నారు. తమ నేతకే టికెట్ కేటాయించాలంటూ నియోజకవర్గ నేతలు అమరావతికి క్యూ కడుతున్నారు.

రాజమహేంద్రవరంలో ఎంపీ సీటుపై టీడీపీలో రగడ కొనసాగుతోంది. ఎంపీ మురళీమోహన్‌ పోటీచేయనని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు, వారి అనుచరులు తమనంటే తమనే అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 15 రోజులుగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ పోటీపడుతుండగా.. తెరపైకి మాగంటి రూప, ముళ్లపూడి రేణుక పేర్లు వచ్చాయి. ఎంపీ సీటును గన్ని కృష్ణకు ఇవ్వాలని రాజమహేంద్రవరం నుంచి కార్పొరేటర్లు, నాయకులు అమరావతికి బయల్దేరారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిపై గొడవ రాజుకుంటోంది. ఎమ్మెల్యే ఆభ్యర్ధిగా చదలవాడ అరవింద్ కుమార్ పేరు ప్రచారంలో రావటంతో పార్టీ స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్నుంచి వైసీపీకి మద్దతుగా నిలిచిన అరవింద్ కుమార్ కు టికెట్ కేటాయించొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు. కోడెల వర్గం మద్దతు లేకుండా నరసరావుపేట ఎంపీ సీటును కూడా గెలవలేరని అంటున్నారు.