మరో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో చేరడానికి సిద్ధం.. టీఆర్ఎస్ వర్గాలు

congress mlas

కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే పార్టీ వీడి.. కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో భంగపడ్డ కాంగ్రెస్‌కు.. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ టెన్షన్ పెడుతోంది. కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలైనా పార్టీలో మిగులుతారా అని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. సీనియర్లు, కీలక నేతలు సైతం.. టిఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ వలలో పడుతున్నారు. దీంతో అసెంబ్లీలో ఒకరిద్దరు మినహా.. కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది..

రేగ కాంతారావు.. ఆత్రం సక్కు.. చిరుమర్తి లింగయ్య.. హరిప్రియా నాయక్‌.. సబితా ఇంద్రారెడ్డి.. ఇప్పుడు కందాళ ఉపేందర్‌ రెడ్డి.. ఇలా ఒకరి తర్వాత మరొకరుగా కేసీఆర్‌నో కేటీఆర్‌నో కలుస్తున్నారు! ఆ వెంటనే హస్తానికి హ్యాండిచ్చి కారు ఎక్కేస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామంటున్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌తో తిరిగి పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు.. దీంతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 సీట్లలో గెలుపొందింది. అందులో ఇప్పటికే ఆరుగురు పార్టీకి దూరమయ్యారు. మిగిలిన 13 మంది ఎమ్మెల్యేల్లో ఇంకా ఇద్దరు కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. శాసనసభలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కొనసాగాలంటే.. కనీసం 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరోవైపు 19 మందిలో 13 మంది టీఆర్‌ఎ్‌సలో చేరితే.. వారంతా కలిసి మాదే అసలైన సీఎల్పీ అంటూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ ఇవ్వొచ్చు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీని.. సీఎల్పీని విలీనం చేసేయాలని కోరే అవకాశం ఉంటుంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 15 మందిలో 12 మంది టిఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలీనమయ్యారు. ఇటీవల శాసన మండలిలో కాంగ్రెస్‌ సభాపక్షం టిఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలీనమైంది. ఇప్పుడు ఇదే విలీన వ్యూహాన్ని శాసనసభలోనూ అమలు చేయనున్నారని తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలలోగా ఆ ఆపరేషన్‌ను ముగించే అవకాశం ఉంది. విలీన ప్రక్రియ పూర్తయితే, టీఆర్ఎస్ లోకి వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ధైర్యంతోనే అవసరమైతే రాజీనామా చేస్తామని ప్రకటిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అనుకున్నట్లుగా విలీనం సాధ్యపడకపోతే, ఉప ఎన్నికలకూ సిద్ధమేనని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంలోని కీలక నేతలు అంటున్నారు.

అయితే కాంగ్రెస్‌ను వీడే జాబితే ఇక్కడికే పరిమితం అవ్వడం లేదు. మరో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 సీట్లను సాధించింది. తర్వాత ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్ర ఎమ్మెల్యేలిద్దరూ టీఆర్‌ఎ్‌సలో చేరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 12 మంది తమతో టచ్‌లో ఉన్నారని, వారిలో 8 మంది ఎప్పుడంటే అప్పుడు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా గుడ్‌బె చెప్పిన వారే కాకుండా.. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కూడా టీఆర్‌ఎ్‌సలో చేరతారనే ప్రచారం ఉంది. అలాగే, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, సీతక్క తదితరులు కూడా జాబితాలో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది.

Recommended For You