వివేకానంద రెడ్డి హత్య కేసు.. పోలీసుల అనుమానం అతని మీదే!

ఎన్నికల సమయంలో వైఎస్‌ వివేకానంద హత్య ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇది రాజకీయ హత్యే అంటూ వైసీపీ-టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీని ఎదుర్కోలేకే టీడీపీ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పులివెందలలో కూడా గెలుస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు పలుమార్లు చెప్పారని…. అందుకే టీడీపీ నేతలే ఈ హత్య చేసి ఉంటారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీకి ఘాటుగా టీడీపీ కౌంటర్‌ ఇస్తోంది. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం వైసీపీకి అలవాటైందని ఆరోపిస్తోంది టీడీపీ. ఓడిపోతామని భయంతోనే సానుభూతి రాజకీయాలకు వైసీపీ తెర తీసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంతో ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కాయి.

మరోవైపు ఈ కేసును విచారిస్తున్న అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలోని ప్రత్యేక సిట్‌ బృందం.. దర్యాప్తును ముమ్మరం చేసింది. అమిత్‌ గార్గ్‌ ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా నిందితుల కాలు, వేలి ముద్రలు లభించినట్లు తెలుస్తోంది. అటు.. ఇంట్లో పని చేస్తున్నవారిని.. వివేకా బంధువులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిందని భావిస్తున్న అర్ధరాత్రి సమయంలో ఇంటి వైపు ఎవరెవరు వచ్చారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు వైఎస్‌ వివేకానంద హత్య కేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. అయితే రాజారెడ్డి హత్య కేసు దోషులతో ఈ హత్యకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజారెడ్డి హత్య కేసులో ఏ-8గా ఉన్న సుధాకర్‌ రెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు..

మొదట వై.ఎస్‌.వివేకానందది సాధారణ మరణమే అనుకున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక మాత్రం ఇది హత్యే అని తేల్చింది. వివేకానంద శరీరంపై ఏడు బలమైన కత్తి గాయాలను గుర్తించారు. పదునైన ఆయుధంతో వివేకా శరీరంపై ఏడు గాయాలు కనిపించాయి. రెండు గాయాలు నుదిటిపై, తల వెనుక, తొడపైనా, చేతిపైనా గాయాలను పోస్టుమార్టంలో గుర్తించారు.

వివేకా మరణంతో వైఎస్‌ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. వివేకానంద పార్ధివ దేహానికి వైసీపీ అధినేత జగన్‌ నివాళులర్పించారు. విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు వివేకానంద భౌతికకాయం దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా వివేకానందకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా విషాద చాయలు అలముకున్నాయి.

Also Read : వివేకానంద పార్ధివ దేహానికి జగన్‌ నివాళులు