వైఎస్‌ వివేకానంద రెడ్డిపై దాడి చేసింది ఒక్కరు కాదు..!

ys vivekananda reddy career

పులివెందుల మరోసారి నెత్తురోడింది. ఎన్నికల వేళ వైఎస్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి చంపారు. ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే అనేక కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. పులివెందులలోని ఆయన స్వగృహంలోనే… గుర్తు తెలియని దుండగులు పాశవిక దాడి చేశారు. ఉదయం పీఏ కృష్ణారెడ్డి నిద్రలేపేందుకు ప్రయత్నించగా… వివేకా స్పందించలేదు. ఆయన అర్ధరాత్రి ఇంటికి వచ్చారని పడుకుని ఉంటారని.. పనిమనుషులు చెప్పడంతో.. అరగంట సేపు ఆగి.. మళ్లీ ప్రయత్నించారు. ఎంతకీ వివేకా నుంచి స్పందన లేకపోవడంతో… వెనక వైపు వెళ్లి చూడగా.. ఇంటి తలుపు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. వివేకా రక్తపు మడుగులో పడి ఉండడం గుర్తించారు.

పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు ఇంట్లోకి వచ్చి ఆధారాలు సేకరించారు. స్నిఫర్‌ డాగ్స్‌ను తీసుకొచ్చి నిందితుల జాడ పసిగట్టే ప్రయత్నం చేశారు. అయితే మొదట ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న వార్తలొచ్చాయి. కానీ సంఘటన స్థలంలోని పరిస్థితి అనేక అనుమానాలకు తావిచ్చింది. బెడ్‌రూంలో దాదాపు రెండు లీటర్ల రక్తం మడుగులా పడి ఉండడం.. బాత్‌రూంలోనూ రక్తం ఉండడం… వివేకా దేహంపై అనేక చోట్ల బలమైన గాయాలు ఉండడాన్ని బట్టి ఇది హత్యే అన్న అనుమానాలు వచ్చాయి. అలాగే వెనకడోర్‌ తెరిచి ఉండడం… వివేకా బాడీని బెడ్‌రూం నుంచి బాత్‌రూమ్‌కు తరలించడం చూస్తుంటే… ఒకరి కన్నా ఎక్కువ మంది ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానించారు..

మధ్యాహ్నం కుటుంబ సభ్యుల సమక్షంలో వివేకా దేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఆయనది కచ్చితంగా హత్యేనని పోలీసులు తేల్చారు. బాడీపై దాదాపు ఏడుచోట్ల బలమైన గాయాలున్నాయని… అవన్నీ పదునైన ఆయుధంతో చేసినవని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసుపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం.. లోతైన దర్యాప్తు చేసేందుకు సీఐడీ అడిషన్‌ డీజీ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్‌గార్గ్‌.. కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. ఘటన స్థలంలో నిందితుల కాలిముద్రలు, వేలి ముద్రలు దొరికాయని ఎస్పీ తెలిపారు.

ఘటన సమాచారం అందుకున్న వైఎస్ విజయమ్మ పులివెందుల చేరుకుని.. మరిది వివేకాకు నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్‌ జగన్‌ సైతం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని వివేకాకు నివాళులు అర్పించారు. వైఎస్‌ కుటుంబ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు.. ఈ హత్య ప్రత్యర్థుల పనేనని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన సుధాకర్‌ రెడ్డే ఈ హత్య కూడా చేశారని అంటున్నారు. రాష్ట్ర పోలీసులు ఈ కేసును నిస్పాక్షికంగా దర్యాప్తు చేయరని… ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : వైఎస్‌ వివేకానంద హత్య కేసు.. వైసీసీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్