వైఎస్ వివేకానందరెడ్డి ప్రస్థానం..

ys vivekananda reddy career

YSR కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. జగన్మోహన్‌ రెడ్డి బాబాయి సీనియర్ రాజకీయ నాయకుడు వివేకానంద రెడ్డి హఠాన్మరణం చెందారు. కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.

YSR అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి. అన్నకు ప్రియమైన తమ్ముడిగానే కాకుండా.. ప్రధాన అనుచరుడుగా పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. వైఎస్‌ అభిమానులతో, పార్టీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉండేవారు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో YSR బిజిగా ఉన్న సమయంలో.. కడప జిల్లాలో క్షేత్రస్థాయిలో వ్యవహారాలను వివేకానంద రెడ్డి చక్కదిద్దేవారు. కడప జిల్లాను వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా మార్చడంలో వివేక పాత్ర చాలా ఉందని YSR గుర్తుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల్లో తనకన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న విషయాన్ని గుర్తుచేసేవారు.

YSR కడప నుంచి ఎంపీగా ఉంటే.. వివేకా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసేవారు. అన్న ఎమ్మెల్యేగా వస్తే.. వివేకా ఢిల్లీకి వెళ్లడం ఆనవాయితీగా వచ్చింది. 1989లో తొలిసారి పులివెందుల నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు వివేకానంద రెడ్డి. 1994లోను గెలుపొందారు. ఆ తర్వాత 99లో కడప నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 2004 ఎన్నికల్లోను ఘన విజయం సాధించారు. అప్పట్లో కడపలో వివేకానందరెడ్డికి సాధించిన మెజార్టీ… రాష్ట్రంలో మరెవ్వరికీ వచ్చేది కాదు. అలాంటి గెలుపు సొంతం చేసుకునేవారు. ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్‌ అలా ఉండేది.

అయితే.. YSR మరణం తర్వాత.. జగన్‌తో విభేదాలు ఏర్పడ్డాయి. 1999లో మండలికి ఎన్నికయ్యారు వివేకానంద రెడ్డి. 2010లో కిరణ్‌ కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయ మంత్రి అయ్యారు. ఆ పదవిలో కొన్ని నెలలు మాత్రమే ఉన్నారాయన. 2011లో జరిగిన ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు.. మంత్రి పదవికే రాజీనామా సమర్పించారు. పులివెందులలో తన వదిన విజయమ్మపైనే పోటీ చేయడం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఆ బైపోల్స్‌లో వివేకానంద రెడ్డి పరాజయం చవిచూశారు. ఆ తర్వాత కుటుంబ కలహాలు సర్దుకున్నాయి. అంతా కలిసిపోయారు. వైసీపీ స్థాపించిన జగన్‌ మోహన్‌ రెడ్డికి అండగా నిలుస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు.

సార్వత్రిక ఎన్నికలతో నిన్నటివరకు బిజీగా ఉన్నారు వివేకానంద రెడ్డి. పార్టీ చర్చల్లో, అనుచరులతో సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కనిపించారు. పులివెందుల వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెల్లారేసరికి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు వివేకానంద రెడ్డి. ఈ విషయాన్ని కడప జిల్లాలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.