వైఎస్‌ వివేకానంద హత్య కేసు.. వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్

సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ రంగును పులుముకుంటోంది. ఏపీలో అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేతలు ఈ హత్యకు మీరంటే మీరే బాధ్యులంటూ విమర్శలు సంధించుకుంటున్నారు. ఎన్నికల్లో తమను ఎదుర్కోలేక టీడీపీయే హత్యా రాజకీయాలు చేస్తోందన్న వైసీపీ ఆరోపణలకు టీడీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. సానుభూతి రుచిచూసిన జగన్‌ మళ్లీ సానుభూతి రాజకీయాలను తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : కాంగ్రెస్ మైండ్ బ్లాంక్..ఎవ‌రిని ఎప్పుడు అవ‌స‌రం అనుకుంటే..

ఎన్నికల సమయంలో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇది రాజకీయ హత్యే అంటూ వైసీపీ-టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కాయి.

తన బాబాయ్‌ వివేకానందరెడ్డిని.. ఇంట్లోకి చొరబడి అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్‌. ఇంత దారుణమైన హత్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. డ్రైవర్‌ పై నేపం నెట్టేందుకు లెటర్‌ను సృష్టించారని విమర్శించారు.. ఈ హత్య కేసులో రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని.. అందుకే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు . సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడే తమ ఇంట్లో హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు జగన్‌.

ఎన్నికల్లో తమ పార్టీని ఎదుర్కోలేకే టీడీపీ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శించారు. పులివెందులలో కూడా గెలుస్తామని ఇప్పటికే తెలుగుదేశం నేతలు పలుమార్లు చెప్పారని.. అందుకే టీడీపీ వాళ్లే ఈ హత్య చేసి ఉంటారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు వైసీపీ నేత ఆరోపణలకు ఘాటుగా కౌంటర్ ఇస్తోంది టీడీపీ ‌. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం వైసీపీకి అలవాటైందని విమర్శించింది. వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారన్నది సిట్‌ దర్యాప్తులో తేలుతుందని మంత్రి ఆది నారాయణ రెడ్డి అన్నారు. తమపై ఆరోపణ చేయడం తగదని.. తాను తప్పు చేస్తే ఉరితీయాలని మంత్రి అన్నారు. తనపై వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి – వివేకానంద్ రెడ్డిల మధ్య విబేధాలు ఉన్నాయని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.

గత ఎన్నికల్లో వైఎస్‌ మరణాన్ని జగన్‌ వాడుకున్నారని.. ఈ ఎన్నికల్లో వివేకా శవాన్ని జగన్ వాడుకుంటున్నారని లింగారెడ్డి విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయో అనే అనుమానం ఉందని విమర్శించారు.

Also Read : వివేకానంద రెడ్డి హత్య కేసు.. పోలీసుల అనుమానం అతని మీదే!