నిజామాబాద్‌లో ఇద్దరు యువనేతల మధ్య బిగ్‌ ఫైట్..

bigg fight between kavitha and arvindh

తెలంగాణలో ఈ సారి నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం హాట్‌హాట్‌ గా మారింది. టీఆరెస్ తరపున సిట్టింగ్‌ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడు డీఎస్ తనయుడు అర్వింద్‌ బరిలోకి దిగుతున్నారు. దీంతో నిజామాబాద్‌లో ఇద్దరు యువనేతల మధ్య బిగ్‌ ఫైట్ జరగనుంది.

రెండేళ్ల కిందట బీజేపీలో చేరినప్పటి నుంచే నిజామాబాద్‌ పై కన్నేసారు అర్వింద్. కమలం కండువా కప్పుకున్న నాటి నుంచే అలుపెరగకుండా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇటు పార్టీని సంస్థాగతంగా పటిష్టరుస్తున్నారు. అటు కొత్త వారిని బీజేపీలో చేర్పిస్తున్నారు. తద్వారా పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న అర్వింద్… పాత కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పైనా స్పందిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆందోళనలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టారు అర్వింద్‌. బోధన్, మెట్‌పల్లిలోని షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపించాలంటూ 10 రోజులు పాదయాత్ర చేసి, బోధన్ లో సభను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల 5 లోక్‌సభ స్థానాల క్లస్టర్ మీటింగ్, అమిత్ షా పర్యటన బాధ్యతలను తన భుజాన వేసుకొని గ్రాండ్ సక్సెస్ చేశారు అర్వింద్. పార్టీలో చేరిన అనతి కాలంలోనే చురుకైన, యువనేతగా పేరు తెచ్చుకోవడంతో బీజేపీ ఈ యువనేతను నిజామాబాద్ బరిలో నిలుపుతోంది.

నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో నిజామాబాద్ అర్బన్, రూరల్‌ తో పాటు బాల్కొండ, బోధన్‌, ఆర్మూర్, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 14 లక్షల మంది ఓటర్లుండగా ఇందులో బీసీలే అధికం. మున్నూరుకాపు, పద్మశాలి, ముస్లిం ఓట్లు కీలకం. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌ కు తన సామాజిక వర్గం ఓట్లు కలిసి రానున్నాయి. అంతేకాదు దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లలోను ఆయనకు బంధువులున్నారు. ఇక నిజామాబాద్ రూరల్‌, బోధన్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాలలో బీజేపీ బలంగా ఉంది. దీంతోపాటు హిందూ సంస్థలైన వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, బంజరంగ్‌దళ్‌ కార్యకర్తలు కూడ ఎక్కువగానే ఉన్నారు. పద్మశాలి కులస్తులతో అర్వింద్ కున్న సత్సంబంధాలు ఆయన గెలుపునకు దోహదపడనున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీని పోటీకి దింపితే అది కూడా ఆర్వింద్‌ కు కలిసి రానుంది. మైనార్టీ ఓట్ల పైనే ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మైనార్టీ అభ్యర్ధిని బరిలోకి దించితే ఓట్లు చీలే అవకాశం ఉండటం అది ఆర్వింద్‌కు లాభించనుంది.

అర్వింద్ కు పార్టీతో పాటు సొంత బలంకూడా ఈ ఎన్నికల్లో కలిసి రానుంది. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. హృద్రోగంతో బాధ పడ్తున్న చిన్నారులకు గుండె ఉచితంగా ఆపరేషన్లు చేయించడం ద్వారా మనసున్నమారాజుగా అనేక కుటుంబల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటివరకు చేసిన సామాజిక సేవ అర్వింద్ కు బలంగా మారనుంది

మరోవైపు పసుపు బోర్డ్ ఏర్పాటు, పంటకు మద్దతు ధర వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడంతో టీఆరెఎస్ ప్రభుత్వంపై జనం గుర్రుగా ఉన్నారు. అయితే అర్వింద్ పసుపు రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలనను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద నిజామాబాద్ సీటుపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక్కడి నుంచి కమల జెండా ఎగురవేస్తామని ధీమాగా ఉన్నారు బీజేపీ నేతలు. దీనికి అనుగుణంగానే అర్వింద్‌ దూసుకుపోతున్నారు. అన్ని కలిసి వస్తే, ఆయన గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.