కోడికత్తి డ్రామా ఆడారు.. ఆ కోవలోనే.. షర్మిలతో పాత కేసులు : సీఎం చంద్రబాబు ఫైర్

today cm chandrababunaidu schedule

పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ప్రజాదరణ చూసి, వైసీపీ నేతలకు కంటగింపుగా మారిందని.. ఆ అక్కసుతోనే పార్టీపై నిందలు వేస్తున్నారని అన్నారు. వివేకానందరెడ్డి హత్య వాళ్ల ఊళ్లో, వాళ్ల ఇంట్లో జరిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. దీనిపై టీడీపీని నిందించడం అమానుషన్న ఆయన.. వాళ్లంతా మానవత్వం లేని మనుషులుగా అభివర్ణించారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్ దురలవాటుగా చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ కోడికత్తి డ్రామా ఆడారని చంద్రబాబు ఆరోపించారు. ఆ కోవలోనే.. షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని విమర్శించారు. కోడికత్తి కేసు ఎన్ఐఏకు ఇవ్వడం వెనుకా రాజకీయ లబ్ది ఉందని చంద్రబాబు అన్నారు. నీతిమాలిన, నేరమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగు తమ్ముళ్లపై ఉందన్నారు. అందుకోసమే ధర్మపోరాటం చేస్తున్నట్టు స్పష్టంచేశారు. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, వైసీపీ కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు బయటకు తీస్తామన్నారు. ఆయన్ను చంపడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. సూత్రధారులు, పాత్రధారుల ముసుగు తొలగిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. కుట్రదారులకు తగిన బుద్ది చెబుతామన్నారు.