నేడు ఎన్నికల సమర శంఖాన్ని పూరించనున్న చంద్రబాబు

cm chandrababunaidu election campaining starts today

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు టీడీపీ సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతిలో సేవా మిత్ర, బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మిషన్ -150 ప్లస్ నినాదంతో ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు గెలుపొందేలా కార్యకర్తలు, నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్నివర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లేనిమిత్తం ఈ బహిరంగ సభలను వేదికగాచేసుకోనున్నారు. అభివృద్ది పథకాలు సగంలోనే నిలిచిపోకుండా మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వచ్చేలా మరోసారి ప్రజల ఆశీర్వాదం తీసుకుని ముందుకు నడిచేలా ఎన్నికల శంఖారావంలో ఆయన తొలిఅడుగు వేయనున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పడిన పరిణామాలు, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రణాళికతో ఈ ఐదేళ్లపాటు చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.

ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో టీడీపీ ఎన్నికల సన్నాహక సభకు భారీ ఏర్పాట్లు చేశారు. రాత్రి శ్రీకాకుళంలోనే బస చేయనున్న చంద్రబాబు ఆదివారం ఉదయం విజయనగరం బయల్దేరి వెళ్తారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ నెల 18న నెల్లూరు,గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లా,19న రాయలసీమలోని కర్నూల్,అనంతపురం, కడప జిల్లాలో నిర్వహించే ఎన్నికల సభల్లో పాల్గొంటారు.