ఆయనే హత్య చేశాడని అనుమానం.. గవర్నర్ ను కలవనున్న జగన్..

ex minister ys vivenakanadhareddy murder case updates

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో వైసీపీ అధినేత జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విజయమ్మ తన మరిదికి నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్‌ జగన్‌ బాబాయ్‌కు అంజలి ఘటించారు. వైఎస్‌ కుటుంబ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు కడసారి చూపుకోసం భారీగా తరలివస్తున్నారు.

మరోవైపు వివేకా హత్యపై ఏపీలో రాజకీయ దుమారం రేపింది. ఈ హత్య ప్రత్యర్థుల పనేనని వివేకా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన సుధాకర్‌ రెడ్డే ఈ హత్య కూడా చేశారని అంటున్నారు. తన చిన్నాన్న అంతటి మంచి వ్యక్తి ఎవరూ ఉండరని, ఆయనలాంటి సౌమ్యుడు మరొకరు లేరని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఓ సీనియర్ రాజకీయవేత్తను అత్యంత దారుణంగా హతమార్చారని చెప్పారు. ఓ మాజీ ఎంపీ ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి చంపడం అనేది అత్యంత దారుణమని తెలిపారు.

ఇంకోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. చంద్రబాబు హయంలో తన తాత చనిపోయారని, తన మీద దాడి జరిగిందని..ఇప్పుడు తన బాబాయి హత్యకు గురయ్యాడని ఆరోపించారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు జగన్. చంద్రబాబు చేతికింద పనిచేసే వ్యవస్థలో న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారాయన. ఈ హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

వివేకా హత్య కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు జగన్. తాను ఉండగానే ఎస్పీకి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయని..తప్పుడు లెటర్ సృష్టించి డ్రైవర్ ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. మరోవైపు వివేకా హత్యకు నిరసనగా వైసీపీ ఇవాళ శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇక జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ బృందం ఇవాళ సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలవనుంది.