వివేకా మరణం వ్యక్తిగతంగా బాధ కలిగించింది : సీఎం చంద్రబాబు

political leaders talks on ys vivekanandhareddy murder

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఇతర నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ హత్యపై చాలా అనుమానాలున్నాయని చెప్పారు. వివేకా మరణం వ్యక్తిగతం బాధ కలిగించిందన్న చంద్రబాబు…. ఆధారాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా ఎవరైనా అసహజ మరణానికి గురైతే డెడ్ బాడీని కానీ, సంఘటన స్థలాన్ని కానీ డిస్టర్బ్ చేయకూడదని, కానీ వివేకా విషయంలో అలా జరగలేదన్నారు. బాత్రూమ్‌ రూం నుంచి బెడ్రూంలోకి ఆయన్ను ఎవరు తెచ్చారని ప్రశ్నించారు. గుండెపోటు అని చెప్పి తలకు గుడ్డకట్టారని, ఈ వ్యవహారంలో స్టెప్ బై స్టెప్ ఆధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. సీఐ వచ్చేసరికి రక్తపు మరకలన్నీ శుభ్రం చేశారని, అనుమానాస్పద మృతిగా భావిస్తున్నప్పుడు పంచనామా చేస్తారని తెలియదా అని ప్రశ్నించారు. వివేకా మరణించిన విషయం ఎంపీ అవినాష్ కు ఎవరు చెప్పారని నిలదీశారు. హత్య కేసులో దోషులను వదిలేది లేదని, దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఇక వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. సొంత మనిషి చనిపోతే మానవత్వం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హత్య కారణాలు తెలియాల్సి ఉందన్నారు. హత్య జరిగింది అని తెలియగానే విచారణకు సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. . ఈ ఘటనలో తన పైనా, లోకేష్ పై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కేంద్రంలో వారికి అనుకూల ప్రభుత్వం ఉన్నందుకే ఈ హత్యపై సీబీఐ విచారణ కోరుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఉదయం లేని లేఖ సాయంత్రానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు చంద్రబాబు. లేఖలో ఉన్న విషయాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయన్నారు. డ్రైవర్ పేరును తీసుకువచ్చారంటే విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా అని నిలదీశారు. ఈ హత్యపై నిజాలు వెలికి తీసి, నిందితులను శిక్షిస్తామంటున్నారు చంద్రబాబు.