మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? : పవన్

మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? : పవన్

pawankalyan

రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ శాసనసభలో సీఎం జగన్ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే..కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదు.. మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? అంటూ పవన్‌ ఎద్దేవా చేశారు.

పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదన్నారు పవన్ కళ్యాణ్‌. కమిటీ రిపోర్ట్ రాకమునుపే జగన్ రెడ్డి మూడు రాజధానులపై అభిప్రాయం చెప్పేశారు. ఇలా అయితే అసలు కమిటీలు వేయడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చేయడం దేనికి? అని ప్రశ్నించారు. వైసీపీ ప్లీనరీలో అమరావతికి ఒకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా? మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? అంటూ నిలదీశారు. కేంద్రం అమరావతిని గుర్తించి మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి? హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అని పవన్ నిలదీశారు.

సీజన్లో కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా, సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలన్నమాట.. మూడు సీజన్లలో అమరావతికి వచ్చి, సభ నడిపి ఆ తరవాత తాళాలు వేసేయాలనేది జగన్ రెడ్డి ఆలోచనలా ఉందని పవన్ కళ్యాణ్‌ ట్వీట్ చేశారు. అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్లని మళ్లీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా? అంటూ ప్రశ్నించారు పవన్. రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమేనన్నారు. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story