పావురం పందెంలో ఓడిపోయిందని.. పాకిస్తానీ చేసిన పని..

పందెంలో గెలుపు ఓటములు సహజం. అది తెలిసి కూడా పగ. అదీ నోరు లేని ఆ మూగ జీవాల మీద. కనీస కనికరం లేకుండా ఆ శాంతి కపోతాలను అగ్నికి ఆహుతి చేశాడు. మంటల్లో చిక్కుకున్న పావురాలు వేడిమికి విలవిలాడుతూ ప్రాణాలు కోల్పోయాయి. అక్కడికక్కడే మాడి మసయ్యాయి.

పంజాబ్ ప్రావిన్స్‌లోని పైసలాబాద్‌లో పావురాల పోటీలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ మనకు కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు అక్కడ పావురాల పందాలు జరుగుతుంటాయి. వాటిపై వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పందాలకు సిద్దం చేస్తుంటారు పందెం రాయుళ్లు. ఎప్పటిలాగే ఓ యువకుడు పావురాల రేసింగ్‌లో పాల్గొన్నాడు.

కానీ అతడి పావురం పందెంలో వెనుకబడింది. గేమ్‌లో ఓడిపోయింది. పెద్ద మొత్తంలో బెట్టింగ్ డబ్బంతా పోగొట్టుకున్నాడు. పందెంలో గెలిస్తే బోలెడు డబ్బొస్తుందనుకున్నాడు. కానీ పెట్టినపెట్టుబడి కూడా పోయేసరికి పావురం మీద కోపం వచ్చింది. వెంటనే మేడ పైకి వెళ్లాడు.

అక్కడ పంజరంలో ఉంచిన పావురాలతో పాటు పందెంలో ఓడిపోయిన పావురం మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీశాడు. పాపం.. ఆ పావురాలన్నీ మంటలనుంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న స్థానికులు వద్దని వారిస్తున్నా వినకుండా వాటిపై కోపంతో కాల్చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ సదరు వ్యక్తి శాడిజంపై మండి పడుతున్నారు.