బిగ్ ఫైట్.. నాగుపాముతో నాలుగు శునకాలు.. చివరకు.. వీడియో వైరల్

యజమాని ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అలుపెరుగని పోరాటం చేశాయి. ఆ క్షణంలో ఆమెను కాపాడాలన్న ఆలోచన తప్ప తమకేమన్నా అయితే అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పెంచిన ప్రేమకు రుణం తీర్చుకున్నాయి. విశ్వాసానికి మారు పేరుగా నిలిచి చివరకు ప్రాణాలు కోల్పోయాయి. బీహార్‌లోని భగల్పూర్‌‌లో నివసిస్తున్న బాబీ ఇంట్లోకి ఓ నాగు పాము చొరబడదామనుకుంది.

ఇంతలో ఆమె ఇంటి ముందున్న నాలుగు శునకాలు పాము జర జరా పాకుతూ ఇంట్లోకి రావడాన్ని గమనించాయి. వెంటనే అలర్టై నాలుగు శునకాలు కలిసి పాముపై మూకుమ్మడి దాడి చేసాయి. పాము కూడా వాటిని చూసి ఏ మాత్రం వెరవకుండా బుసలు కొడుతూ ప్రతి దాడికి దిగింది. కోరల్లో దాగి వున్న విషాన్ని శునకాలపై గుప్పించింది. శునకాలు ఓ పక్క అరుస్తూనే మరో పక్క పాముని ప్రతిఘటిస్తున్నాయి.

దాదాపు మూడు నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో పాము విషం బారిన పడి శునకాలు ప్రాణాలు కోల్పోయాయి. ఒక్కసారిగా అన్ని శునకాల అరుపులు విన్న ఇంట్లోని వారు నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చి చూశారు. పోరాడీ పోరాడీ చివరకు పాము చేతిలో మరణించిన శునకాలను చూశారు. ఆగ్రహంతో పాముని కూడా చంపేశారు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంటి ఓనర్ బాబీ మాట్లాడుతూ శునకాల కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పింది. కానీ తనను కాపాడిన శునకాలన్నీ ప్రాణాలు కోల్పోవడం బాధిస్తుందని తెలిపింది.