కేంద్రంలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి – చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి ఖాయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జేడీఎస్ కు మద్దతుగా రాయ్ చూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన. దేశ ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పిన మోదీని పదవి నుంచి పంపించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. మరోవైపు మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా.. కాంగ్రెస్‌ నేత విజయశాంతి సైతం ప్రచారం చేశారు.

జేడీఎస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కర్ణాటకలో పర్యటించారు సీఎం చంద్రబాబు. రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవేగౌడతో కలిసి ప్రచారం నిర్వహించిన సీఎం.. రాయ్ చూర్ సభ వేదికగా ఎన్డీయే ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ లేని రాష్ట్రాల్లోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు చంద్రబాబు.

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు చేసిన చంద్రబాబు.. కేంద్రంలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని రాయ్ చూర్ లోని తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే తాము కాంగ్రెస్ పక్షాన నిలబడ్డామని అన్నారు.

ఇక ఏఐసీపీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇక బీజేపీ పని అయిపోయిందని అన్నారు. దేశరక్షణ పేరుతో సెంటిమెంట్ పండిస్తున్న మోదీ తీరు వల్ల దేశంలో లక్షల మంది యువతకు ఉపాధి దూరం అయ్యారని ఆరోపించారు.

మరోవైపు…కాంగ్రెస్‌ నేత విజయశాంతి కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. ఉత్త ర కర్ణాటకలోని కలబుర్గీ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా క్యాంపెయిన్‌ చేశారు. ప్రధాని మోదీ ప్రజావిశ్వాసం కోల్పోయారన్నారు విజయశాంతి. దేశానికి రాహుల్‌ నాయకత్వం కావాలన్నారామె.

తెలుగు ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపించే రాయ్ చూర్ బెల్ట్ లో చంద్రబాబు ప్రచారానికి విశేష స్పందన కనిపించింది. మరోవైపు విజయశాంతి ప్రచారం… కాంగ్రెస్‌కు లాభిస్తుందంటున్నారు హస్తం నేతలు.

Recommended For You