నాపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం-రంజన్‌ గొగోయ్‌

Ranjan-Gogoi

లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం అని ఆయన కొట్టి పారేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికే ఇదొక ప్రమాదకరమైన పరిణామమన్నారు. 20 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించిన తనపై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానన్నారు. ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు చీఫ్‌ జస్టిస్ రంజన్‌ గొగోయ్‌. బ్యాంకు ఖాతాలో కేవలం ఆరు లక్షలు ఉన్న తనపై ఆర్థిక పరమైన ఆరోపణలు చేయలేరు కాబట్టి… ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పేందుకే ఈ రోజు తాను కోర్టులో కూర్చుని ఉన్నానన్నారు రంజన్‌ గొగోయ్‌.

జస్టిస్‌​ రంజన్‌ గోగొయ్‌ గతంలో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేశారు. ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను… తన కుటుంబాన్నిఇబ్బందులకు గురి చేశారని… అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతో సుప్రీం జడ్జిలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సిజేఐ జస్టిస్ రంజన్‌ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

Recommended For You