వాతావరణంలో అనూహ్య మార్పులు..

తెలంగాణలో గత పది రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా భరించలేని ఎండలు. సాయంకాలం ఊహించని వర్షాలు. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు పడుతున్నాయి. కాలం కాని కాలంలో కురిసిన వర్షాలకు మామిడి, కంది, మిరప, పెసర, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన ఉద్యానవన పంటలు నేలపాలయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు, వడగండ్లకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల పరిధిలోని వరుసగా మూడోరోజుల పాటు గాలివాన, వడగళ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని మేడిపల్లి​, మల్యాల, బెజ్జంకి, కోహెడ మండల్లాలో వడగళ్ల వాన కురిసింది. మామిడి పంట నేలపాలైంది. ఆరుగాలం పడిన కష్టం మట్టిలో కలిసిపోయింది. వేములవాడ, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అటు అమ్మకానికి సిద్దం చేసిన వరి ధాన్యం నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో అకాల వర్షం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉరుములు-మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి, మామిడి, కూరగాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాదాద్రి-భువనగిరి పరిధిలో ఎక్కువ నష్టం సంభవించగా.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో రాశులుగా పోసిన వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దైంది.

అటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వందల ఎకరాల్లో మామిడిపంట దెబ్బతింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట, పరకాల, నర్సంపేట మండలాల్లో వరిపంట నేలకొరిగింది. అరటి తోటల్లో గెలలు రాలిపడ్డాయి. మిర్చిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లోని మిరప నీటి పాలైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆరువేల ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ఇక సిద్దిపేట జిల్లాలో 1500 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో మొక్కజొన్న, 3000 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సుమారు వేయి ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.

Recommended For You