భాగ్యనగరంలో భారీ వర్షం..స్టేడియంలో కుప్పకూలిన ఫ్లడ్‌లైట్‌ టవర్‌

Rains

తెలంగాణ వ్యాప్తంగా మరోసారి అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, టవర్లు నేలకూలాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, సోమాజిగూడా, కృష్ణానగర్‌, సికింద్రాబాద్‌, ఎల్బీ నగర్‌, నాగోల్‌, హయత్‌నగర్‌లో తదితర ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కారణంగా… పలు చోట్ల విద్యుత్‌ నిలిచిపోయింది.

ఈదురు గాలులకు ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌ టవర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. వెంటనే ఎల్బీస్టేడియానికి చేరుకున్న డీఆర్‌‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఘటనాస్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ దాన కిషోర్‌…. సహయక చర్యల్ని ముమ్మరం చేశారు.

భారీ వర్షం కురుస్తుండటంతో… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు జీఎహెచ్‌ఎంసీ కమిషనర్‌. కూలిన చెట్లను వెంటనే తొలగించి.. రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్‌తో పాటు అటు జిల్లాల్లోనూ ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. వడగండ్ల వానతో ఉట్నూరు మండలం దంతన్‌ పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వనపర్తి జిల్లాలో అకాల వర్షం అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి ఆత్మకూరు మండలంలో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.