ఏపీలో టీడీపీదే గెలుపు. .పోలింగ్‌ తీరుపై చంద్రబాబు ఆరా

tdp

మే 23న ఏపీలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు…పోలింగ్‌ సరళిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అమరావతిలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేతలతో పోలింగ్‌ సరళి, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. పోలింగ్‌ ఎలా జరిగింది? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో ఎంత వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అన్నదానిపై అభ్యర్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థితో మాట్లాడిన చంద్రబాబు… నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ తీరుపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంలు, వైసీపీ నేతల వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించారు.
.
ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు, సిబ్బంది పని తీరులో ఉన్న లోపాలను ఎమ్మెల్యే అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పడిన ఓట్లలో తేడాలున్నాయని పార్టీ అధినేతకు వివరించారు. ఈ సందర్భంగా ఈవీఎంలపై తమ పోరాటాన్ని చూసి ఓటమికి సంకేతమంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంతో… డీలా పడొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.

జూన్‌ 8 వరకు టీడీపీ ప్రభుత్వం ఉందని.. ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. టీడీపీ కోసం క్యూలో నిలబడి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని సూచించారు. చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న టీడీపీ అధినేత.. ఎన్నికల్లో అక్రమాల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీదే విజయమని నేతలతో అన్నారు.

సమీక్షలపై వస్తున్న విమర్శలపై కూడా చంద్రబాబు స్పందించారు. ప్రెస్‌మీట్లు, సమీక్షలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని…క్యాంప్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అంటూ నిలదీశారు. కేంద్రం ఏపీలో ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని.. తెలంగాణలో ఒక్కరిపైనా ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదన్నారు చంద్రబాబు.

మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండాలని నేతలకు సూచించారు టీడీపీ అధినేత. ఎన్నికల కోడ్‌ నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని అన్నారు. ఎన్నికలు ముగిశాయని పాలనపై దృష్టి పెట్టకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. సమస్యలు, తాగునీటి ఎద్దడిపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు…ప్రజా సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేయాలని సూచించారు.

కోడ్‌ ఉన్న సమయంలోచంద్రబాబు ఎలా సమీక్షలు చేస్తారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ ప్రణాళిక సంఘం వైఎస్‌ ఛైర్మన్‌ కుటుంబరావు కౌంటర్‌ ఇచ్చారు. దేనికి కోడ్‌ వర్తిస్తుందో..దేనికి వర్తించదో తెలియని దుస్థితిలో వైసీపీ నేతలున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర కేబినేట్‌ భేటీకి వర్తించని కోడ్‌… ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షకు ఎలా వర్తిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు కుటుంబరావు.

మొత్తం మీద అభ్యర్థుల నుంచి పోలింగ్‌ సరళిపై వివరాలు సేకరించిన టీడీపీ అధినేత..గెలుపుపై ఫుల్‌ కాన్ఫిడెన్స్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.