టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కు..

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడో కొత్త చిక్కొచ్చి పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అనగానే ఎగిరి గంతేశారు. కానీ ఆశావహుల లిస్టు చాంతాడంత ఉంది. కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అనేలా తయారైంది పరిస్థితి. ఎవరిని బరిలోకి దింపాలి? ఎవరిని వద్దనాలి? వద్దంటే రెబెల్‌గా పోటీకి దిగుతారేమోననే టెన్షన్. గెలిపించడంలో తేడా వస్తే బాస్‌ గుస్సాకు గురికాక తప్పదు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ పార్టీ అదే జోరుతో పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ప్రచారం నిర్వహించింది. ఇక గ్రామ స్థాయిలో టీఆర్‌ఎస్ పార్టీ బ‌లోపేతం అవ్వాలంటే ఖ‌చ్చితంగా జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురావేయాల‌ని పార్టీ అధినేత కేసీఆర్ అదేశించారు. అన్ని స్థానాల్లో గెలిపించుకునే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేల‌కు అప్పగించారు. అంతేకాదు ఎవరిని బరిలోకి దింపాలనేది కూడా ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకోవాలని ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యేల అనుచరుల్లో ఆశావహులు చాలా మందే ఉన్నారు. వారిలో ఎవరికి ఓకే చెప్పాలి? ఎవరికి నో చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఎమ్మెల్యేలది. ఎందుకంటే ఎవరి మనసు నొప్పించినా… రెబెల్‌గా బరిలోకి దిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే పోటీలో ఉన్న అభ్యర్థి గెలుపు అవకాశాలు తగ్గిపోతాయి. ఏదైనా తేడా వస్తే… బాస్‌ ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇదే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.

హైక‌మాండ్ పెట్టిన టార్గెట్‌ను రీచ్ కావడానికి ఎమ్మెల్యేలు అష్టకష్టాలు పడుతున్నారు. వరుసగా వస్తున్న ఎన్నికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇక ఎంపీటీసీ, జ‌డ్పీటీసి ఎన్నిక‌ల్లో.. అభ్యర్థులను నిర్ణయించే అధికారం ఉన్నా.. అయినవారికి బరిలోకి దింపడం సవాలుగా మారింది. కారు స్పీడులో గెలుస్తామనే నమ్మకంతో చాలామంది పోటీకి సై అంటున్నారు. తమనే బరిలోకి దింపాలంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు.

ఒత్తిడి పెరగడంతో నొప్పించక తానొవ్వక అనే రీతిలో తప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు తంటాలు పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక తమ పరిధిలో లేదని, హైకమాండ్ చూసుకుంటుందని అనుచరులతో చెప్తున్నారు. అయినాసరే కొందరు ఆశావహులు అదేమీ వినిపించుకోవడం లేదు. మీరే అధిష్ఠానంతో మాట్లాడి టికెట్ ఇప్పించాలంటూ ఎమ్మెల్యేలపై ప్రెజర్ తెస్తున్నారు. దీంతో ప్రధాన అనుచరుల పోరు భరించలేక.. సర్వేను సాకుగా చూపుతున్నారు. ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై పార్టీ సర్వే చేపడుతోంది. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక క్యాండేట్ల ఎంపికను హైకమాండే చూసుకోవాలని కోరుతున్నారు. మరి అధిష్టానం పెట్టిన పరీక్షలో ఎమ్మెల్యేలు ఎలా నెగ్గుతారో చూడాలి.