కొత్త అనుమానాలకు తావిస్తోన్న ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన ఢిల్లీ పర్యటన అనుమానాలకు కారణం అవుతోంది. అయన ఎందుకు వెళ్తున్నారు, ఎవర్ని కలవబోతున్నారని ఆరా తీస్తున్నాయి పార్టీలు. అయితే.. అధికార వర్గాలు మాత్రం ఎన్జీటీ విచారణ కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు.

కొన్నాళ్లుగా ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, టీడీపీ నేతల మధ్య ఉప్పు నిప్పులా ఉంది వ్యవహారం. కోడ్ ను సాకుగా చూపించి చివరికి సీఎంని కూడా పట్టించుకోకుండా అహంకారంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉంది. అయితే..సీఎస్ ను నడిపించే శక్తులు ఢిల్లీలో ఉన్నాయని మొదట్నుంచి ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఎల్వీ ఢిల్లీ పర్యటన కొత్త అనుమానాలకు తావిస్తోంది. సీఎస్ తన ఢిల్లీ పర్యటనలో ఎవరెవర్ని కలుస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

అయితే.. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటిలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు., అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం., అటవీ చట్టాల ఉల్లంఘనపై ఎన్జీటి రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై శుక్రవారం మధ్యాహ్నం నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌‌లో విచారణకు రానుంది. ఈ విచారణకు హజరయ్యేందుకే చీఫ్‌ సెక్రటరీ ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నారు అధికారులు.

అధికారికంగా ఎల్వీ సుబ్రమణ్యం ఎన్జీటీ విచారణ కోసమే వెళ్తున్నా.. కేవలం దీనికే పరిమితం అవుతారా? మిగిలిన సమయంలో ఢిల్లీ పెద్దలను కలుస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ సూచనలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కూడా పట్టించుకోకుండా సీఎస్ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని టీడీపీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం లేకుండానే సమీక్షలు నిర్వహిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీఎస్‌ టార్గెట్‌గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో.. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సీఎస్ ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని అంచనాలు వేస్తున్నారు.