అరుదైన దృశ్యం.. మాయావతి కాళ్లకు మొక్కిన డింపుల్ యాదవ్

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పార్టీల మధ్య సమైక్యత, సంఘీభావం ఏమేరకు బలపడుతుందో చాటిచెప్పే అరుదైన దృశ్యమిది.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి, ములాయం కోడలు డింపుల్ యాదవ్ గురువారం మాయావతి కాళ్లకు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. తాను పోటీ చేస్తున్న కన్నౌన్ నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా డింపుల్ ఈ మేరకు అభిమానం చాటుకున్నారు. సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘ఎస్పీ-బీఎస్పీ పార్టీలు దేశానికి కొత్త ప్రధాన మంత్రిని ఇవ్వనున్నాయి..’  అని వ్యాఖ్యానించడం విశేషం.

ఉత్తర ప్రదేశ్‌లో బలమైన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీల మధ్య… 1995లో విడిపోయిన నాటి నుంచి ఉప్పు-నిప్పులా వైరం సాగింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం మళ్లీ ఏకతాటి మీదికి రావడంతో… ఇరు పార్టీల అధినేతలు తమ కార్యకర్తలు పరస్పరం కలిసి కట్టుగా నడుకోవాలని కోరుతూ వస్తున్నారు. ఇరువురూ పరస్పరం గౌవరంగా మాట్లాడుకుంటు న్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఎస్పీ-బీఎస్పీల మధ్య పొత్తుకుదిరిన తర్వాత అఖిలేశ్ మాట్లాడుతూ… ‘మాయావతిని అవమానిస్తే నన్ను అవమానించినట్టే…’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా గతవారం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎస్పీ కురువృద్ధుడు ములాయం సింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒకే స్టేజిపై కనిపించిన సంగతి తెలిసిందే.