ప్లీజ్ నాన్నా.. నన్నొదిలేసి నువ్వెళ్లొద్దు.. వీడియో వైరల్

నా బంగారం కదూ.. ఈ రోజు త్వరగా వచ్చేస్తానుగా.. నన్ను వెళ్లనివ్వు కన్నా.. అబద్దం చెబుతున్నారని తెలిసినా చెప్పక తప్పని పరిస్థితి.. డ్యూటీ అలాంటిది. పగలూ రాత్రి తేడా ఉండదు.. సమయం అసలే తెలియదు. అందరి కోసం డ్యూటీ చెయ్యాలి. ఉన్న ఒక్క పిల్లాడిని వదిలేసి వెళ్లాలి. నగరం ప్రశాంతంగా నిద్రపోవాలంటే పోలీస్ మెలకువతో ఉండాలి. ఇంట్లో పిల్లలు లేచేసరికే డ్యూటీకి వెళ్లి పోయి వారు నిద్ర పోయాక ఇంటికి వచ్చి.. వారితో గడిపే సమయం దొరక్క పోలీస్ పడే వేదన వర్ణనాతీతం. అటు ఆలిని, ఇటు బిడ్డల్ని సముదాయిస్తూ.. బాస్ ఆర్డర్స్‌ని ఫాలో అవుతూ మంచి పోలీస్ అనిపించుకోవాలి. తనతో తాను రాజీ పడాలి. ఇంటికి వచ్చిన తండ్రితో ఉన్న కాసేపు ఆనందంగా గడిపాడు రెండేళ్ల చిన్నారి.

తండ్రి మళ్లీ డ్యూటీకి రెడీ అయిపోతుంటే వెళ్లొద్దు నాన్నా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇంట్లో ఉండి తనతో ఆడోకోవాలంటూ మారాం చేస్తున్నాడు. ఏడుస్తున్న కొడుకుని వారించలేక, ఆఫీసుకు వెళ్లలేక ఆ పోలీస్ తండ్రి పడుతున్న బాధ చెప్పనలవి కానిది . తాను వెంటనే వచ్చేస్తానని ఎంత చెప్పినా అర్థం చేసుకునే వయసు లేదు ఆ చిన్నారికి. నాన్నని వెళ్లనివ్వు నాన్నా అంటూనే అమ్మ ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 20 సెకన్లు ఉన్న ఈ వీడియో హృదయాన్ని పిండేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే పోలీసుల కష్టాలను ఈ వీడియో కళ్లకు కడుతోంది. కొడుకు ఎంత మారాం చేస్తున్నా సముదాయించి డ్యూటీకి వెళుతున్న పోలీసుకు నెటిజన్లు సలాం కొడుతున్నారు.

Recommended For You