మానవ అస్ధిపంజరాల సరస్సు గుట్టు!

ఒక రహస్యం. అలాంటిలాంటి రహస్యం కాదు. 11వందల ఏళ్లుగా అంతుబట్టకుండా మిగిలిపోయిన ఒక రహస్యం. 6వందల మనిషి అస్తిపంజరాల తాలూకు కధలను కడుపులో దాచుకున్న సరస్సు తాలూకు రహస్యం. హిమాలయ పర్వత సానువుల మధ్యలో చాలా ఏళ్లుగా నిక్షిప్తమైన ఒక రహస్యం ! అత్యంత ఎత్తయిన పర్వతాలను సైతం అధిరోహించిన పర్వతారోహకులు కూడా..అక్కడకు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

విశాలమైన హిమాయల పర్వతాలు..ఆ విశాలమైన పర్వతాల మధ్య ఒక సరస్సు.. సరస్సు ఎంత విశాలమైనదో..
దానికి సంబంధించిన కధ కూడా అంతే రహస్యమైనది! ఎటుచూసినా ఎముకల గుట్టలు..పుర్రెల పుట్టలు
పర్వతారోహకులను ఆటుగా ఆకర్షించే అస్తిపంజరాలు! ఆ రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు
కానీ.. ఎవరి వల్ల కాలేదు.! మానవ అస్తిపంజరాల అజ్ఞాత సరస్సు మిస్టరీ ఇది!!

సముద్రమట్టానికి 16వేల 500 అడుగుల ఎత్తులో. హిమాలయాల నడిబొడ్డున..నందాదేవీ పర్వతాల నడుమ..
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో రూప్‌కుండ్‌ అనే సరస్సు ఇది. అక్కడ ఉన్న అస్తిపంజరాల మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. ! వీటిని చూసినవాళ్లు ఎవరూ కూడా జీవితంలో వాటిని మర్చిపోలేరు. 9వ శతాబ్దానికి సంబంధించిన అస్తిపంజరాలుగా వీటిని చెప్తారు. అంటే..ఇవాళ్టికి 1100 ఏళ్ల నాటి పురాతనమైనవి!


ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అవి ఎవరివి? అనేదానిపై కూడా భిన్న కధనాలు వినిపిస్తుంటాయి. కొంతమంది ఆ కాలంలో టిబెట్‌కు వ్యాపారంకోసం వళ్లేవారి అస్తిపంజరాలని అంటారు. మరికొంతమంది యుద్ధానికి వెళుతున్న సైనికుల అస్తిపంజరాలని చెప్తారు. ఇంకొంతమంది నందాదేవి దర్శనానికి వెళ్తున్న భక్తులవంటారు! వీటిలో ఏది నిజమో.. ఏది అబద్ధమో ఇప్పటిదాకా ఎవరికీ అంతుబట్టలేదు. ఎవరూ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. కానీ.. చాలావరకు ఇవి సైనికులవేనని చెప్పడానికి కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ సరస్సుకు దగ్గర్లో కొన్నేళ్ల క్రితం సైనికులు వాడిన ఆయుధాలు ,వారి దుస్తులు పర్వతారోహకులకు దొరికాయి. చరిత్రకారులూ ఇది నిజమే అయ్యుండవచ్చని అంటారు!

16వేల అడుగుల ఎత్తున్న ఈ రూప్‌కుండ్‌ సరస్సును చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. ప్రాణాల మీద ఆశవదులుకునేవాళ్లే ఇక్కడకు ట్రెక్కింగ్‌కు వెళ్తారు. వెళ్లినా.. ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సాయంత్రానికి తిరిగివచ్చేలా ప్లాన్‌ చేసుకుంటారు. 1942లో ఈ అస్తిపంజరాల సరస్సు గురించి ప్రపంచానికి తెలిసింది. నందాదేవి పర్వతంపై ట్రెక్కింగ్‌కు వెళ్లిన రేంజర్‌ మధ్వాల్‌.. మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించారు. ఒకే చోట 600కిపైగా అస్తిపంజరాలు ఉన్న వార్త.. దావానలంలా వ్యాపించింది. ఆ తర్వాత 1957లో ఈ రహస్యం గుట్టును ఛేదించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ.. వాటిపై ఒక క్లారిటీ మాత్రం రాలేదు.! ఈ అస్తిపంజరాలు ఎవరివి? అవి ఎంత పురాతనమైనవి? సరస్సులోకి ఒకేసారి ఇన్ని అస్తిపంజరాలు ఎలా వచ్చాయనే అంశాన్ని శోధించేందుకు 2003, 2004లో ఇండియా, యూరోప్‌ దేశాలకు చెందిన టీమ్‌లు అక్కడకు వెళ్లాయి. 8 లేదా 9వ శతాబ్దం మధ్యలోనివిగా తేల్చారు. వాటి వయసు అయితే తెలిసింది కానీ.. అవి ఎవరివి అనే విషయాన్ని తెలుసుకునేందుకు వాటికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేశారు. అందులో.. ఆ అస్తిపంజరాలు మహారాష్ట్రకు సమీపప్రాంతాల వారివిగా తేలింది.

కానీ..ఒక సరస్సు ఒకేసారి 600మంది ప్రాణాలను ఎలా బలితీసుకుంది? అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? లేక ఇది ఒకసారి జరిగిన సంఘటన కదా? ఒక దుర్ఘటనలో వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారా లేక మరేదైనా మిస్టీరియస్‌ కారణముందా? ఏళ్లపాటు ఈ అస్తిపంజరాలపై రీసెర్చ్‌ చేసిన శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్లే వీళ్లంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని తేల్చారు. అయితే, మరికొంతమంది శాస్త్రవేత్తలు.. ఈ అస్తిపంజరాలపై ఆయుధాలతో ఎటాక్‌ చేసి గుర్తులున్నాయని కూడా చెప్తారు. అయితే, పక్కాగా ఇదీ కారణం అనేది మాత్రం ఎవరూ తేల్చలేకపోయారు. ఇంతకమంది ఇక్కడకు వచ్చిన కారణాన్ని, చనిపోయిన పరిస్ధితులను అంచనావేయలేకపోతున్నారు. దీంతో.. 1100 ఏళ్ల నాటి మిస్టరీ.. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.!!!

హిమాలయ పర్వతాల్లో దాగున్న ఈ రూప్‌కుండ్‌ సరస్సుకు చేరుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు ఎంతో ధైర్యం కావాలి. అంతకంటే ఎక్కువ కష్టపడాలి. రోజుల పాటు మంచుకొండలమీద ట్రెక్కింగ్‌ చేయాలి. వందలకిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. అయినప్పటికీ.. కేవలం ఇక్కడ మానవకంకాళాల అద్భుతాన్ని చూడటానికే ఎంతోమంది ట్రెక్కర్స్‌ రూప్‌కుండ్‌ వెళ్తుంటారు. అయితే, వీటన్నిటి మధ్య..ఏళ్లుగా ఇక్కడే ఉన్న అస్తిపంజరాలను ఈ మధ్య దొంగతనం చేస్తున్నారన్న వార్త అందరినీ కలవరపెడుతోంది.

రూప్ కుండ్ చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా, ట్రెక్కింగ్‌ చేసేవాళ్లు మరియు సాహసాలు చేసేవారు రోడ్డు మార్గం ద్వారా లోహజంగ్ లేదా వాన్ ప్రయాణిస్తారు. అక్కడ నుండి, వాన్ వద్ద కొండ ఎక్కి రాణీ కీ ధార్‌ అనే ప్రాంతానికి చేరతారు. అక్కడ కొంత బల్లపరుపు ప్రాంతం కూడా ఉండటంతో రాత్రివేళలో బసచేయవచ్చు. తరువాత బెడ్ని బుగ్యల్ అనే ప్రాంతాన్ని చేరుకోవాలి. ఇది వాన్ నుండి 12-13 కి. మీ దూరం ఉంటుంది. బెడ్ని బుగ్యల్ నుండి హిమాలయాల శిఖరాన్ని చాలా స్పష్టంగా చూడచ్చు. బెడ్ని బుగ్యల్ నుండి 10-11 కి. మీ ఉండే.. భాగువబాస వరకూ ట్రెక్కర్స్‌ వెళతారు. భాగువబాస నుండి నేరుగా రూప్‌కుండ్‌ సరస్సుకు చేరుకోవచ్చు. సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ అస్తిపంజరాల సరస్సు మంచుతో కప్పబడి ఉంటుంది. అయినప్పటికీ, రూప్‌కుండ్ కు వెళ్ళే ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. దారంతటా అన్ని వైపులా పర్వత శ్రేణులతో నిత్యం ప్రమాదకరంగా సాగుతుంది. ఈ నేపధ్యంలో అస్తిపంజరాలను మాయమవుతున్నాయనే వార్త.. స్ధానిక యంత్రాంగంతో పాటు పర్యాటకులను కలవరపెడుతోంది. వందల ఏళ్లనాటి ఈ అస్తిపంజరాలను ఎవరు తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? వాటితో ఏం చేస్తున్నారు? తాంత్రికమైన పనులకోసం వాటిని దొంగిలిస్తున్నారా? లేక ఇంకేదైనా కారణముందా?

చాలాకాలం క్రితమే ఉత్తరాఖండ్‌ సర్కార్‌ కూడా అస్తిపంజరాలు మాయమవుతున్నాయన్న విషయాన్ని ధృవీకరించింది. గతంలో 600కుపైగా ఉన్న వాటిలో.. ఇప్పుడు సగం కూడా కనబడటంలేదని చెప్తారు. అయితే, మంచుకొండలు కావడం, అతిశీతల వాతావరణ పరిస్ధితులు అక్కడ ఉండటంతో.. గతంలోలా మంచులో అవి మళ్లీ కూరుకుపోయి ఉంటాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయిన అస్తిపంజరాల సీక్రెట్‌కు 2013 ఏడాదిలో ఫుల్‌స్టాప్‌ పెట్టారు నిపుణులు. 9వ శతాబ్దంలో భారత్‌కు చెందిన ఒక తెగవాళ్లే మంచుతుఫానులో చనిపోయినట్టు నిర్ధారించారు. వాళ్ల పుర్రెలపై ఉన్న గుర్తుల ఆధారంగా ఈ కంక్లూజన్‌కు వచ్చినట్టు చెప్తారు.

Recommended For You