కాంగ్రెస్‌కు మంట పుట్టించిన రాజీవ్‌పై మోదీ వ్యాఖ్యలు!

చేతి రేఖలు బాగా లేనట్లుంది. అందుకేనేమో, హస్తానికి కాలం కలసి రావడం లేదులా ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుల్లో హ్యాండ్‌కు బ్యాండ్ పడుతోంది. రాఫెల్ డీల్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టులో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికలు-ఈవీఎంలు-కోడ్‌ ఉల్లంఘనలపై కూడా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా సుప్రీంకోర్టు మరో సారి హస్తానికి షాకిచ్చింది. ఎన్నికల సంఘం తీరునే సమర్దించిన అత్యున్నత న్యాయస్థానం, కావాలంటే మళ్లీ ఇంకోసారి తమ వద్దకు రావొచ్చంటూ హితవచనాలు పలికింది.

ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాలపై కాంగ్రెస్ పార్టీ కస్సుబుస్సుమంటోంది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని నెంబర్ వన్ అవినీతిపరుడు అంటూ మోదీ చేసిన ఆరోపణలు హస్తానికి మంట పుట్టించాయి. రాజీవ్‌పై మోదీ వ్యాఖ్యలు చాలా దారుణమని, ఎలక్షన్ కోడ్‌కు విరుద్దమంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పరిశీలించిన ఈసీ, ఎన్ని కల కోడ్‌ను మోదీ ఉల్లంఘించలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు మోదీ ప్రసంగ వీడియోలను చూశామని, ఐతే మోదీ ఎక్కడా కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు కనిపించలేదని స్పష్టం చేసింది. ఇది కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈసీ తీరుపై మండిపడిన కాంగ్రెస్ నాయకులు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్వేషపూరిత ప్రసంగాలను గుర్తించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈసీ నిర్ణయాన్ని తప్పుగా చూడలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయా న్ని సమర్దించిన సుప్రీం, ఆ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాకపోతే, తమ తీర్పును మళ్లీ సవాల్ చేసుకోవచ్చంటూ ఓ ఆప్షన్ ఇచ్చింది.

మోదీ ప్రసంగాలు, ఎన్నికల కోడ్‌, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు ఈసీ వద్ద కాంగ్రెస్ నాయకులు ఎదురుదెబ్బ తిన్నారు. అమరవీరుల ప్రస్తావన, బాలా కోట్ వైమానిక దాడులు, సైన్యం ప్రస్తావన సహా వివిధ అంశాలపై మోదీ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా మాటలు కూడా రెచ్చగొట్టేవిలా ఉన్నాయని ఆరోపించారు. అలాగే, మోదీ-షాలకు వ్యతిరేకంగా తాము ఇచ్చిన పిటిషన్లపై ఈసీ నిర్ణయం తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఐతే, ఫిర్యాదులను ఒక్కొ క్కటిగా పరిశీలి స్తున్నామని ఈసీ బదులిచ్చింది. స్పందించిన కోర్టు, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. తాజాగా రాజీవ్‌పై మోదీ విమర్శలతో కాంగ్రెస్ పార్టీ మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది. ఈసారి కూడా హస్తానికే నిరాశే మిగిలింది. మోదీ, షాల ప్రసంగాలకు క్లీన్ చిట్ ఇస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంలో కలగచేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Recommended For You