ఐపీఎల్‌ 12 విజేత.. చివరి ఓవర్ లో మ్యాజిక్ చేసిన మలింగ

హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఐపీఎల్ ఫైనల్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించిన రోహిత్‌, డీకాక్‌లు చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అయితే స్కోర్ బోర్డ్‌ పరుగులు పెడ్తుండగా వారిద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్‌, కృనాల్‌ తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇషాన్‌ కిషన్‌, పోలార్డ్‌ రాణించడంతో ముంబయి 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ 3 వికెట్లతో చెలరేగాడు. చెన్నై బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి రోహిత్‌ సేనను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

స్వల్ప స్కోరే, ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫీల్డర్లు క్యాచ్‌ల్‌ మిస్ చేసినా వికెట్లు తీసి, చెన్నైని మట్టికరిపించారు. విజయం కోసం చివరి బంతి దాకా ఆగాల్సి వచ్చింది. షేన్ వాట్సన్ మళింగ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకు పడడంతో చెన్నై తప్పకుండా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఏ ఒక్క బాట్స్‌మెన్ అతనికి అండగా నిలవలేకపోయారు. ధోని, రైనా త్వరగా ఔట్‌ కావడం ముంబైకి కలిసి వచ్చింది.

చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు అవసరమైనప్పుడు కృనాల్‌ వేసిన 18వ ఓవర్‌లో 20 పరుగులు రాబట్టారు వాట్సన్‌, బ్రావో. అయితే 19వ ఓవర్‌లో బుమ్రా మళ్లీ మాయ చేసి వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. 16వ ఓవర్‌లో మలింగ 20 పరుగులు ఇవ్వడంతో అతడికి కెప్టెన్ రోహిత్‌ శర్మ బంతి ఇస్తాడో లేదో అనుకున్నారు. చివరికి అతడికే బంతిని అప్పగించాడు. కెప్టెన్ తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు మళింగ. చివరి ఓవర్ లో మ్యాజిక్ చేశాడు. తన అనుభవం, టెక్నిక్‌ ఉపయోగించి అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. మూడు బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి వాట్సన్‌ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. చివరి బంతికి శార్దూల్‌ను ఎల్బీ చేసి, ముంబైకి చిరస్మరణీయమైన విజయాన్నందించాడు మలింగ. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి ముంబై నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రోహిత్‌ బౌలర్లను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించి తానెంత విలువైన సారథో మరోసారి అందరికీ నిరూపించాడు.

Recommended For You