అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిస్సోరిలోని సెయింట్ లాయిస్ నగరంలో జరిగిన తుపాకి కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ష్రేవె ఫోర్ థౌసెండ్ బ్లాక్ లోకి చేరుకున్న పోలీసులకు బుల్లెట్ గాయాలతో ఉన్న వారు కనిపించారు. వారిలో ముగ్గురు మృతిచెందగా మరికొందరు తీవ్రగాయాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా 20 ఏళ్లనుంచి 30 ఏళ్లమధ్య వయస్సువారేనని పోలీసులు తెలిపారు. వీరంతా నల్లజాతీయులే. కాల్పులు ఎవరు జరిపారనేది తెలియరాలేదన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు.

అమెరికాలో నిత్యం ఎక్కడో ఒక చోట తుపాకి కాల్పులు జరుతూనే ఉన్నాయి. గత వారంలో మూడు ప్రాంతాల్లో తుపాకి కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మేరీల్యాండ్, ఒహియో, నార్త్ కరోలినాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు అమాయకులు బలయ్యారు. మేరీల్యాండ్ లోని వెస్ట్ బాల్టిమోర్ లో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. ఒహియోలోని ఉత్తర సిన్ సినాటి ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. చార్లెట్ లోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో ఓ అగంతకుడు కాల్పులకు తెగబడటంతో ….ఇద్దరు విద్యార్ధులు మృతిచెందారు. నలుగురు గాయపడ్డారు.

దేశవ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తుపాకి సంస్కృతికి చెక్ పెట్టాలని నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో విద్యార్ధులు, అధ్యాపకులు ప్రభుత్వానికి తమ ఆవేదనను వ్యక్త పరిచారు. ఫ్లోరిడాలో ఏకంగా పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు తుపాకులిచ్చి విద్యార్ధులకు రక్షణ కల్పించే వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే ఇంతజరుగుతున్నా దేశంలో గన్ కంట్రోల్ పై ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి

Recommended For You