వైసీపీ కోరిన చోట్ల రీ పోలింగ్ : టీడీపీ

tdp

చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్.ఆర్. కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంట్రామాపురం, పులివర్తిపల్లి పోలింగ్ స్టేషన్‌ల్లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రీ పోలింగ్ నిర్వహించాలని చంద్రగిరి వైపిపి అభ్యర్థి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల కమీషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సిఇవో ద్వివేది దర్యాప్తుకు ఆదేశించారు. సిఇవో ద్వివేది నివేదిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు చోట్ల ఈ నెల 19వ తేదిన రీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 6 గంటల్లోపు క్యూలైన్ లో ఉన్నవారు అందరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు.

ఈ రీపోలింగ్‌పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలైన వెంటనే అక్రమాలు జరిగిన 49 చోట్ల రీ పోలింగ్ జరుపాలని నిబంధనల ప్రకారం తాము ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకసారి రీ పోలింగ్ జరిగిన తరువాత మరొకసారి ఎలా రీ పోలింగ్ నిర్వహిస్తారని కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ నెల 5 వ తేదిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఇవో ద్వివేదికి ఫిర్యాదు చేయగా 8వ తేదిన కేంద్ర ఎన్నికల సంఘంకు ఆయన విజ్ఞప్తిని పంపించారని, తాము ఎన్నికలు అయిన వెంటనే 49 చోట్ల రి పోలింగ్ జరుపాలని కోరినా పట్టంచుకోలేదని మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక కమిషన్‌ను కూడా అన్ని వ్యవస్థల్లాగే నిర్వీర్యం చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. వైసీపీ కోరిన చోట్ల రీ పోలింగ్ చేస్తు తాము కోరిన చోట్ల రీ పోలింగ్ నిర్వహించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పుడు రీ పోలింగ్ వ్యవహారం ఏపిలో మల్లీ కాక పుట్టిస్తోంది.

Recommended For You