బర్త్‌డే పార్టీలు ఇలా చేసుకుంటే .. ఇక మీరు జైలుకే..

స్నేహితుడు పుట్టినరోజు.. ఇంకేముంది రూమ్‌లో సందడే..సందడి..అర్ధరాత్రి మెుదలు పెట్టిన పార్టీ ఉదయం వరకు కొనసాగాల్సిందే. కేక్ కట్టింగ్, తర్వాత దానిని బర్త్ డే బాయ్ ముఖానికి పూసి బర్త్‌డే బంప్స్‌తో స్నేహితుల హడావుడి. ఆ తర్వాత మందు పార్టీ. ప్రస్తుతం చాలా మంది బర్త్ డే వేడుకల్లో ఫాలో అవుతున్న ఓ ట్రెండ్. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి వేడుకలకు ఫుల్‌స్టాప్ పడనుంది. వేడుకల్లో హద్దులు మీరితే జైలుకు వెళ్లాల్సిరావచ్చు. గుజరాత్‌ పట్టణం సూరత్‌లో పుట్టిన రోజు వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బర్త్ డే వేడుకలలో ముఖంపై కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే చేసినా జైలుకు వెళ్లాల్సి వుంటుంది. ఈ ఆంక్షలకు కారణం సూరత్ పట్టణంలో ఇటివల జరిగిన ఓ సంఘటన.

పట్టణంలోని ఇమాస్ రోడ్డులో ఇటీవల కొంతమంది బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వారు హద్దు మీరి ప్రవర్తించారు. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు విసురుకుంటూ గందరగోళం సృష్టించారు. వారు విసిరిన కోడిగుడ్లు రోడ్డుపై పడిపోవడంతో పలువురు గాయాలపాలయ్యారు. దీంతో ఈ సంఘటనపై పోలీస్ కమిషనర్ సతీష్ శర్మకు ఫిర్యాదు అందింది. వేడుకలో పాల్గొన్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి ఉదంతాలు పట్టణంలో జరుగుతుండడంతో పోలీస్ కమిషనర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మన భాగ్యనగరలో కూడా ఎక్కువైపోయాయి. ఇటీవల బర్త్‌డే బంప్స్ పేరుతో ఐఐఎమ్ విద్యార్థిని తీవ్రంగా కొట్టారు తోటి స్నేహితులు అతని కడుపుపై గట్టిగా కొట్టడంతో అతడి క్లోమ గ్రంథి దెబ్బతిన్నది. దీంతో అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.అలాగే కొంతమంది పుట్టిన రోజు వేడుకల పేరుతో నగర రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. దీంతో భాగ్యనగర పోలీసులు కూడా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్థమవుతున్నారు.

Recommended For You