మూడేళ్లపాటు మృగాళ్ల చేతిలో నరకం..

పద్నాలుగేళ్ల పసి ప్రాయానికి పెళ్లి చేసి రెక్కలు విరిచేశారు తల్లిదండ్రులు. ఓ బిడ్డకు తల్లి కూడా అయిన తరువాత భర్త నిరాదరణకు గురయింది. విభేదాల కారణంగా విడిపోయారు. బిడ్డని పెట్టుకుని ఒంటరి జీవనం సాగిస్తోంది. సమాజంలోని మృగాళ్ల చూపులన్నీ ఆమె మీదే. ఆధారం లేదు. ఆదరించే వారు లేరు. అసహ్యించుకునే వారే ఎక్కువ. ఇన్నిటి మధ్యలో జీవనం సాగించడం కష్టమనుకుంది. బ్రతుకు మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. యూపీ హపూర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ మీద అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గత మూడేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నారు.

బయటకు చెప్తే తననే అంటారని మింగలేక కక్కలేక బ్రతుకుని భారంగా ఈడ్చేది. ఏళ్లు గడుస్తున్నా తన జీవితంలో మార్పు లేదు. దీంతో బ్రతుకు మీద విరక్తి చెంది తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణ వార్త తెలిసినా పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఢిల్లీ మహిళా కమిషన్ యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతో పాటు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మహిళ మరణించిన 14 రోజుల తరువాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. 16 మంది నిందితులుగా తేలినప్పటికి సరైన సాక్ష్యాధారాలు లేక ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు అంటున్నారు.

Recommended For You