ప్రయాణికులకు నరకం చూపించిన భారీ ట్రక్కు

హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సిటీ శివార్లలోని శంషాబాద్‌ దగ్గర ఓ భారీ ట్రక్కు ప్రయాణికులకు నరకం చూపించింది. పెద్ద షాపూర్‌ దగ్గర యూటర్న్‌ తీసుకునే సమయంలో పాడైపోయింది. దీంతో.. ఇరువైపుల 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

హైదరాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు సిమెంట్‌ లోడుతో ఓ భారీ ట్రక్కు వెళ్తోంది. పెద్ద షాపూర్‌ దగ్గర యూటర్న్‌ తీసుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. నడిరోడ్డులోకి రాగానే ఆ ట్రక్కు పాడైపోయింది. ఎటూ కదల్లేదు. స్థానికుల సాయంతో పక్కకు తీసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో.. రెండు వైపుల ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారి కావడంతో చూస్తుండగానే ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలన్నీ భారీ ట్రక్కు పుణ్యమా అని రెండు గంటలపాటు నిలిచిపోయాయి. ఉదయం సిటీ నుంచి కార్యాలయాలకు బయల్దేరిన ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక.. ఎటూ వెళ్లలేక రెండు గంటలు నరకం చూశారు. స్పాట్‌కు చేరుకున్న శంషాబాద్‌ పోలీసులు గంటపాటు శ్రమించి లారీని నడిరోడ్డుపైనుంచి పక్కకు తీశారు. ఇందుకు స్థానికులతో పాటు.. ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకం చూసిన ప్రయాణికులు సైతం ఓ చెయ్యి వేసి.. ట్రక్కు బాధ నుంచి విముక్తి పొందారు.

Recommended For You