ఏపీలో మరో ఐదు చోట్ల రీపోలింగ్‌

ఏపీలో మరో ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. తాజాగా ఈసీ ఆదేశాలతో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో 5 చోట్ల రీపోలింగ్‌
జరగనుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఫిర్యాదుతో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.

ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్త కండ్రి, కమ్మపల్లి, వెంకటరామాపురంలో ఈ నెల 19న ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించింది. అయితే ఈసీ తీరుపై టీడీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఈసీ తీరుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ, రెండు రాష్ట్రాల్లో 42 పార్లమెంట్‌ స్థానాలకు ఏక కాలంలో పోలింగ్‌ జరగ్గా.. ఒక్క ఏపీలోనే 10 పోలింగ్‌ కేంద్రాలకు రెండు దశల్లో రీ పోలింగ్‌ నిర్వహిస్తుండడంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

చంద్రగిరిలో 2 స్థానాల్లో రీ పోలింగ్‌కు నిర్వహించాలి పోలింగ్‌ ముగిసిన రోజు రిటర్నింగ్‌ అధికారికి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. మరోవైపు గతనెల 15న విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారికి రీ పోలింగ్‌పై ఫిర్యాదు చేశారు అయినా.. ఆ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే పోలింగ్‌ ముగిసిన 25 రోజుల తరువాత వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే.. 5 పోలింగ్‌ బూత్‌ల్లో రీ పోలింగ్‌ ఎలా పెడతారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Recommended For You