అందుకే ‘ఆర్ధర్ కాటన్’ ని అపర భగీరధుడిగా కొలిచారు..

దుఃఖదాయిని  ప్రజలను భయపెట్టిన గోదారమ్మను వరప్రదాయనిగా మార్చిన వ్యక్తి సర్ ఆర్ధర్ కాటన్. అతివృష్టి, అనావృష్టిల దాటుకొని ఉభయగోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయి. అందుకే ఆయన్ని అపర భగీరధుడిగా కొలిచారు ప్రజలు. కానీ, ఇప్పుడు కాటన్ దొర జయంతిని కూడా పట్టించుకోలేని పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు ఉత్సవాలు చేసే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు సైతం జయంతి ఉత్సవాలను గాలికొదిలేసారు.

19యేళ్ల వయసులో భారత్ కు వచ్చి ఈస్టిండియా కంపెనీలో ఇంజనీర్ గా దక్షిణ భారతదేశంలో బాధ్యతలు చేపట్టిన సర్ అర్ధర్ కాటన్..19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. గోదావరిపై ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంతో గోదావరీ తీరంలో ప్రజల జీవనగతులే మారిపోయాయి. కృతజ్ఞతగా ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. దేవుడిలా కొలుచుకున్నారు. సర్ అర్ధర్ కాటన్ జయంతి సమయంలో ఊరూ వాడా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ అనవాయితీని కొనసాగిస్తూ వచ్చినా..రాను రాను ప్రభుత్వం ఆయన్ని, ఆయన సేవలను మర్చిపోయింది.

వాస్తవానికి సర్ అర్ధర్ కాటన్ చేసిన సేవకు ప్రభుత్వం నిరంతరం అందరికీ తెలిసేలా చేయాలి. బడ్జెట్ లో పెట్టి జయంతి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. కానీ, జయంతి రోజున కనీసం కాటన్ సేవలను ప్రభుత్వ అధికారులు విస్మరిస్తున్నారు. ఇన్నాళ్లు దండేసి చేతులు దులుపుకే వారు కూడా ఈ సారి కనిపించలేదు. మరోవైపు ఆయన జ్ఞాపకాలమందిరంగా ఉన్న కాటన్ మ్యూజియం నిర్లక్ష్యానికి గురవుతోంది. కాటన్ దొర నడయాడిన ప్రాంతం ఆయన వినియోగించిన వస్తువులు.. నిర్మాణానికి సంబంధించిన చరిత్ర జ్ఞాపకాలన్ని నిర్లక్ష్యానికి గురౌతున్నాయి.

Recommended For You